కారేపల్లి, సెప్టెంబర్ 12 : విభిన్న సంస్కృతులు, భాషలు, ఆచార సాంప్రదాయాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు కలయికే భారతీయత అని, అటువంటి భారతీయతకు నిజమైన ప్రతిరూపం సీతారాం ఏచూరి అని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కారేపల్లిలో సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని పార్టీ మండల కార్యదర్శి కె.నరేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భారతీయతను కాపాడుటకై తన జీవితకాలాన్ని అంకితం చేసిన త్యాగశీలి సీతారాం ఏచూరి అన్నారు. సమిష్టి తత్వానికి ప్రతిరూపమైన భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఆ ప్రయత్నాన్ని గత ఎన్నికల్లో ఇండియా కూటమిని నిర్మించడం ద్వారా సీతారాం ఏచూరి అడ్డుకున్నట్లు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలలో 400 సీట్లు వస్తాయని విర్రవీగిన మోదీ, సీట్లు తగ్గి ఇతర పార్టీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నిలుపుకోవాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమే బీహార్ లో ఎస్ఐఆర్ తీసుకొచ్చి దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్న వారిని అనార్హులుగా ప్రకటిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్య పరిచి పోరాడటమే సీతారాం ఏచూరి ఆశయాలను సాధిండమని, దానికి అందరూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు వజ్జా రామారావు, సీనియర్ నాయకులు తలారి దేవ ప్రకాష్, ముక్క సీతారాములు, హామాలి మేస్త్రీ ఆరెల్లి శ్రీరాములు, సైదులు, సంపత్, వెంకన్న, బాబు, రాములు, ఉపేందర్ పాల్గొన్నారు.