నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 12 : రైతన్న నోట యూరియా ఒక పాట మాదిరిగా మారి.. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా యూరియా దొరుకుతుందా..ఈ రోజు ఎక్కడ ఇస్తున్నారు.. రెండు బస్తాలు ఉంటే ఇప్పించరాదు అనే మాటలే వినబడుతున్నాయి. నల్లగొండ మండలంలో పీఏసీఎస్ గొల్లగూడ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలో రైతు వేదికలో యూరియా సరఫరా చేస్తున్నామని వ్యవసాయ అధికారులు ముందు రోజు ప్రకటించడంతో రైతులు తెల్లవారేసరికి రైతు వేదికల వద్ద పెద్ద ఎత్తున క్యూలైన్లు కట్టారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా యూరియా రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
120 టన్నులు రావాల్సిన యూరియా, కేవలం 60 టన్నులు మాత్రమే రావడంతో ఒక్కో రైతుకు రెండు యూరియా బస్తాలు మాత్రమే శుక్రవారం సాయంత్రం అందజేయాల్సిన పరిస్థితి నెలకొంది. పలుచోట్ల వేచి చూసినా యూరియా రాకపోవడంతో అక్కడ రైతులకు టోకెన్లు ఇచ్చి రేపు వచ్చి యూరియా తీసుకోవాలని సూచించారు. దీంతో రైతులు ఆగ్రహంతో వెనుతిరిగారు. పానగల్ చారుమతి చైల్డ్ కేర్ వద్ద ఉన్న పీఏసీఎస్ గోదాం వద్దకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడికి యూరియా రాకపోవడంతో పీఏసీఎస్ సిబ్బంది రైతులకు టోకెన్లు అందజేశారు.