Mathew Hayden : యాషెస్ సిరీస్ అంటేనే స్లెడ్జింగ్.. ఆటగాళ్ల కవ్వింపులు, సెంచరీల మోతలు, బౌలర్ల వికెట్ల జోరు కళ్లముందు మెదులుతాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్టు హోరాహోరీగా తలపడే ఈ సిరీస్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. ఎప్పటిలానే యాషెస్‌కు ముందు ఇరుదేశాల దిగ్గజాలు, ఆటగాళ్లు తమ జట్టు బలాబలాల గురించి మాట్లాడున్నారు. ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ (Mathew Hayden) మాత్రం తన రూటే సెపరేటు అని చాటుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. యాసెస్లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ సెంచరీ (Joe Root) చేయకుంటే తాను మెల్బోర్న్ క్రికెట్ మైదానం(MCG)లో నగ్నంగా నడుస్తానని వెల్లడించాడు.
ఒకప్పుటి విధ్వంసక ఓపెనర్ హేడెన్ ‘ఆల్ ఓవర్ బార్ ది క్రికెట్’ అనే పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ‘యాషెస్ ఆల్‌టైమ్ జట్టు’లో రూట్ పేరు లేకపోవడాన్ని అతడు తప్పుపట్టాడు. ఫ్యాబ్ 4లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న రూట్‌ను పక్కన పెట్టడం అవివేకమని హేడెన్ అన్నాడు. అంతటితో ఆగకుండా ఎవరూ ఊహించని కామెంట్ చేశాడీ వెటరన్.
Mathew Hayden 👀 👀 pic.twitter.com/JicI1ElDiG
— Cricket 🏏 (@Sunny29548707) September 12, 2025
ఇంగ్లండ్ స్క్వాడ్‌లో అన్నివిధాల ఉపయుక్తమైన క్రికెటర్ రూట్. మీరు అతడిని ఆల్‌టైమ్ టీమ్‌లో తీసుకోకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం రూట్ సగటు 40. అత్యధిక స్కోర్ 180. ఈ వేసవిలో ఆసీస్‌పై అతడు సెంచరీ కొట్టకుంటే నేను ఎంసీజీలో నగ్నంగా నడుస్తాను’ అని ఆల్ఓవర్ బార్ ది క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో హేడెన్ పేర్కొన్నాడు. హేడెన్ చేసిన కామెంట్స్‌పై అతడి కూతురు గ్రేస్ హ్యారిస్ ఫన్నీగా స్పందించింది. ‘ప్లీజ్ రూట్.. సెంచరీ కొట్టు’ అని కామెంట్ చేసింది.
I’ll walk nude around the MCG if he (Joe Root) doesn’t make a hundred this summer (Ashes down under).
– Matthew Hayden (All Over Bar The Cricket Podcast)#Ashes2025 #AUSvENG pic.twitter.com/uEdH7B63Pf
— NightWatchMad 🏏 (@NightWatchMad) September 12, 2025
సుదీర్ఘ ఫార్మాట్లో అత్యుత్తమ ఆటగాడైన రూట్ అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో మూడు సెంచరీలతో కదం తొక్కాడు. ఒకే ఒక ఇన్నింగ్స్‌తో దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, జాక్వెస్ కలిస్, రికీ పాంటింగ్ రికార్డులు బద్ధలు కొట్టాడు. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న రూట్.. కచ్చితంగా యాషెస్‌లో వంద కొడుతాడనే ధీమాతోనే హేడెన్ ‘న్యూడ్ వాక్’ కామెంట్ చేశాడు. అయితే… ఆస్ట్రేలియాపై రూట్ రికార్డు ఏమంత ఘనంగా లేదు.
ఇతర జట్లపై చెలరేగిపోయే ఈ సొగసరి బ్యాటర్ ఒక్క సెంచరీ కొట్టలేదు. గత 27 ఇన్నింగ్స్‌ల్లో 35.68 సగటుతో 892 రన్స్ చేశాడంతే. మూడుసార్లు రూట్ 80 ల్లోనే ఔటయ్యాడు. దాంతో, ఈసారైనా కంగారూ నేలపై శతకం బాదాలనే కసితో ఉన్నాడీ నంబర్ 1 బ్యాటర్. యాషెస్ సిరీస్ 2025-26 ఈ ఏడాది నవంబర్ 21 నుంచి జనవరి 8 వరకూ జరుగనుంది. అయితే.. గత మూడు పర్యాయాలు కంగారూ గడ్డపై ఇంగ్లండ్ జట్టు ఓడిపోతూ వస్తోంది. 2011 తర్వాత ఇంగ్లీష్ టీమ్ అక్కడ ఒక్కటంటే ఒక్క టెస్టు గెలువలేదు. సో.. ఈ చెత్త రికార్డును చెరిపేయాలని బెన్ స్టోక్స్ బృందం అనుకుంటోంది.