మాగనూరు : తెలంగాణలోని ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో ( Aided schools ) స్పెషల్ టీచర్లను ( Special teachers) నియమించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మాగనూరు మండల అధ్యక్షులు బాబు ఎంఈవో మురళీధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వెల్లడించారు.
కోవిడ్ అనంతరం పిల్లల మానసిక స్థితిలో అనేక మార్పులు వస్తున్నాయని, అటీజం, మేధోపరమైన వైకల్యం, సెరిబ్రల్ పాల్సి, వినికిడి లోపం, అభ్యసన వైకల్యం, ప్రవర్తన , ఇంద్రియ లోపాలు వంటి అనేక రకాల వైకల్యాలతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తనను అర్థం చేసుకునేందుకు వీలుగా పిల్లల వైద్యులు డెవలప్మెంట్ పీడియాట్రీసియన్స్, స్పీచ్ , లాంగ్వేజ్ థెరపిస్టులు, బిహేవియర్ థెరపిస్టులు, కౌన్సెలింగ్ థెరపిస్టులను నియమించాలని కోరారు.
2016 ఆర్పీడబ్లూడీ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం ప్రభుత్వ అనుమతి పొందిన విద్యా సంస్థల్లో వైకల్యం కలిగిన విద్యార్థులకు విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక మండల కార్యదర్శి రవి, సభ్యులు లంగటి వాబయ్య, దండు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.