ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 12 : ఖమ్మం రూరల్ మండలంలోని ఎం వెంకటయ్య పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఐడిబిఐ భారీ వితరణ చేయడం ఎంతో అభినందనీయమని ఎంపీడీఓ కె. శ్రీదేవి అన్నారు. శుక్రవారం పాఠశాలకు ఖమ్మం ఐడిబిఐ బ్రాంచ్ రూ.2 లక్షల విలువైన కంప్యూటర్లు, ఫ్యాన్లను ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ కృష్ణ ప్రసాద్, సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ నాగరాజు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ శ్రీనివాస్ హాజరయ్యారు. తొలుత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ లెర్నింగ్ ల్యాబ్‌ను వారు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలన్నారు.
పాఠశాల పురోభివృద్ధికి గ్రామ, ఇతర ప్రముఖులు పూనుకోవడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో పాఠశాల అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఎంపీడీఓ తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి మంచి ఫలితాలను రాబట్టాలని, తద్వారా తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐడిబిఐ సిబ్బంది వెంకన్న, శివ, రమేశ్, వెంకట్, గ్రామ పెద్దలు వెంకటరమణ నాగయ్య, నాగేశ్వరరావు, పాఠశాల హెచ్ఎం డివిఎన్ ప్రసాద్, ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Khammam Rural : ప్రభుత్వ పాఠశాలకు ఐడిబిఐ వితరణ అభినందనీయం : ఎంపీడీఓ శ్రీదేవి