KTR | యూరియా కష్టాలను చిత్రీకరిస్తున్నారని ఖమ్మం జిల్లాకు చెందిన టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావుపై అక్రమ కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతుల కష్టాలు చూపిస్తే పోలీసు కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఇది రైతుల సమస్యలను పరిష్కరించే సమయం. జర్నలిస్టులను వేధించే సమయం కాదని కాంగ్రెస్ సర్కార్కు కేటీఆర్ హితవుపలికారు. రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం, వాటిని బయటపెట్టినందుకు జర్నలిస్టులను, మీడియాను బెదిరించడం ఎంతమాత్రం సరికాదని సూచించారు. ఇది ప్రభుత్వ నిరంకుశత్వానికి, ఇందిరమ్మ పోలీస్ రాజ్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ చాలా ముఖ్యమని అన్నారు. దాన్ని అణిచివేయడానికి పోలీసులను వాడటం అప్రజాస్వామికమని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే సాంబశివరావుపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.