ఊట్కూర్, (కృష్ణ) సెప్టెంబర్ 30 : ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్టమ్మ తల్లి ఉగ్ర రూపం దాల్చింది. మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో నారాయణపేట జిల్లాలోని కృష్ణా, భీమా నదులు గత మూడు రోజులుగా పొంగి ప్రవహిస్తున్నాయి. ఉభయ నదులు పొంగి ప్రవహిస్తుండడంతో మంగళవారం కృష్ణానదికి 5,30,000 క్యూసెక్కుల వరద కొనసాగింది.
ఉభయ నదులకు భారీ వరద ప్రవాహం వస్తుండడంతో అటు కృష్ణ, ఇటు భీమా నదీ పరివాహక ప్రాంతాల్లోని కృష్ణ, తంగిడి, కుసుమూర్తి, లింగదహల్లి, ఐనాపూర్, వాసునగర్, హిందూపూర్ శివారుల్లో వేలాది ఎకరాల్లో సాగైన వరి పంటలు వరద నీటిలో మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది ఎకరాల్లో వరి పంట లు నీట మునిగి రైతులను కన్నీరు పెట్టించగా నదీ శివారులో సాగు నీటి కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ మోటర్లు, కరెంటు సామగ్రి వరద నీటిలో మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు దిక్కు తోచని స్థితి లో కొట్టు మిట్టాడుతున్నారు.
ఇదే క్రమంలో కృష్ణ మండలం టైరోడ్డు సమీపంలోని వాసునగర్ను వరద నీరు చుట్టు ముట్టింది. వాసునగర్లోకి వరద నీరు చేరండతో ప్రజలు ఇండ్లకు తాళాలు వేసుకుని గ్రామాన్ని ఖాళీ చేశారు. మూడు రోజులుగా దాదాపు 50 కుటుంబాలకు చెందిన 150మంది గ్రామస్తులు గొడ్డు గోదంతో సమీపంలోని కృష్ణా చెక్‌పోస్టు వద్ద బంధువుల ఇండ్లల్లో తలదాచుకుంటున్నారు. పొట్ట, పాలు పోసుకునే దశలో వరి పంటలు వరద నీటి పాలు కావడంతో రూ. లక్షల్లో పెట్టిన పెట్టుబడులు చేతికి అందే పరిస్థితి లేదని రైతులు కన్నీరు పెడుతున్నారు.
గ్రామాన్ని వరద ముంచెత్తడంతో పశువులకు పశు గ్రాసం లేక ఇబ్బందులకు గురవుతున్న ట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పా లనలో జిల్లాలోని కృష్ణ మండలం వాసునగర్, మారుతినగర్లతోపాటు లోతట్టు గ్రా మాలు వరద నీటిలో చిక్కుకుని ప్రజల బతుకులను అతలాకుతలం చేసిన ఘటనలను నదీ పరివాహక గ్రామా ల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
మంగళవారం మంత్రి వాకిటి శ్రీహరి ముం పు గ్రామాలను సందర్శించి నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. వరి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట కృష్ణ తాసీల్దార్ శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్‌సుధాకర్, ఎస్సై నవీద్, జీపీవోలు తిరుపతి, బాలరాజు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద..
మహారాష్ట్రలోని సన్నతి బ్యారేజ్ (చితాపూర్) బ్యారేజ్ నుంచి భీమా రిజర్వాయర్‌కు సోమవారం భారీగా వరద ప్రవాహం కొనసాగగా మంగళవారం వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు 37 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 4,0,0000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో అంతే స్థాయిలో కొనసాగుతున్నది.
అలాగే నారాయణపూర్ రిజ ర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం 31.459 టీ ఎంసీలు ఉంది. ఇన్‌ఫ్లో 1,30,000, ఔట్‌ఫ్లో 1.34,760 క్యూ సెక్కులు కొసాగుతున్నది. ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. గత మూడు రోజులుగా కృష్ణ, భీమా ఉభయ నదులు పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు గ్రామాల ప్రజ లు ఒకింత ఆందోళకు గురవుతున్నారు.