ఖమ్మం, సెప్టెంబర్ 30: ‘ఎన్నికల హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ప్రశ్నించారు. అక్రమ కేసులు, తప్పుడు కేసులు బనాయించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులపై కేసులను ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ నాయకులు, మంత్రి పొంగులేటి అనుచరులు, వారి ప్రోద్భలంతో పోలీసులు చేస్తున్న వేధింపులను తాళలేక బీఆర్ఎస్ తిరుమలాయపాలెం మండల ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం మండల అధ్యక్షుడు బానోత్ రవి(ఆర్మీ రవి) సోమవారం పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, బానోత్ చంద్రావతి, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజులతో కలిసి వద్దిరాజు, తాతా మధు ఈ సందర్భంగా మాట్లాడారు.
ఖమ్మం జిల్లాలో కొంతమంది పోలీసులు, అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, అధికారులమనే విషయాన్ని పక్కనబెట్టి మంత్రుల అనుచరుల ఆదేశాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు, అధికార పార్టీ నేతల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయని అన్నారు. తాము తల్చుకుంటే వచ్చే ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరినీ అసెంబ్లీలో అడుగు పెట్టనీయబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాల నుంచి తమ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునని అన్నారు.
హామీలెందుకు అమలు చేయరు?
అధికారంలోకొచ్చి 21 నెలలు అవుతున్నా ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ పాలకులు ఎందుకు అమలు చేయడం లేదని వద్దిరాజు, తాతా మధు ప్రశ్నించారు. కానీ, హామీలపై ప్రశ్నిస్తే మాత్రం కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాను కారణంగా చూపి కేసులు పెట్టొద్దని సుప్రీం కోర్టే ఇటీవల తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. అయినా పోలీసులు కాంగ్రెస్ నేతల ప్రోద్భలంతో బీఆర్ఎస్ నేతలైన పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ సహా కూసుమంచి, తిరుమలాయపాలెం, చింతకాని, మధిర, కొణిజర్ల మండలాల నేతలపై అక్రమ కేసులు పెట్టారని, మానసికంగా వేధించారని అన్నారు.
పోలీస్స్టేషన్లలో శారీరకంగానూ శిక్షించారని ఆరోపించారు. అలాగే, ప్రత్యేకంగా గిరిజనులను టార్గెట్‌గా చేసుకొని కేసులు పెడుతున్నారని, లగచర్ల నుంచి తిరుమలాయపాలెం వరకు ఇదే జరుగుతోందని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తేల్చిచెప్పారు. ఇప్పుడు తమ కార్యకర్తల పట్ల పక్షపాతంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న పోలీసులపైనా, అధికారులపైనా రేపు తమ ప్రభుత్వం వచ్చాక చర్యలుంటాయని స్పష్టం చేశారు.
అధికారులు తమ విధులు మాత్రమే నిర్వహించాలిగానీ ఎలాంటి హోదా లేని వ్యక్తుల ఇళ్లలో సేవలు చేయవద్దని హితవుచెప్పారు. ఉద్యమకారుడు ఉప్పల వెంకటరమణ, న్యాయవాద జేఏసీ అధ్యక్షుడు బిచ్చాల తిరుమలరావు, బీఆర్ఎస్ నాయకులు ఖమర్, బెల్లం వేణు, బాశబోయిన వీరన్న, ఆరెంపుల వీరభద్రం, పగడాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
దయాకర్‌రెడ్డి నాలుగో మంత్రా?
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులకు తోడు అదనంగా తుంబూరు దయాకర్‌రెడ్డి నాలుగో మంత్రిగా వ్యవహరిస్తున్నారని వద్దిరాజు, తాతా మధు ఆరోపించారు. ఈ నలుగురి ప్రోత్సాహం, ప్రోద్భలంతోనే బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూ మానసింగా వేధిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి కాకుండా నాలుగో మంత్రిగా పొంగులేటి కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి వ్యవహరిస్తూ.. అనేక విషయాల్లో కలెక్టర్‌కు, పోలీస్ కమిషనర్‌కు, ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. పైగా ఆయన ఏ హోదాలో ఉండి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని, చెక్కులు పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారు.
తుంబూరు దయాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు రామసహాయం నరేశ్‌రెడ్డి, రమేశ్, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, తిరుమలాయపాలెం ఎస్ఐ జగదీశ్‌లు ప్రణాళిక ప్రకారమే బానోత్ రవిని వేధించారని, అతడిపై కేసులు బనాయించారని ఆరోపించారు. వీటిపై ఉన్నతాధికారులు వెంటనే విచారించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని; అలాగే.. దయాకర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, రమేశ్‌లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని, ఎలాంటి కేసులకైనా భయపడబోమని స్పష్టం చేశారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలి
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న, అధికార పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు కోరారు. ఈ మేరకు ఖమ్మంలో సీపీ సునీల్‌దత్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసుల గురించి గతంలోనూ అభ్యంతరం వ్యక్తం చేశామని, అయినా వారిపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. తిరుమలాయపాలెం ఎస్ఐ జగదీశ్ వ్యవహార శైలిపైనా అనేకమార్లు ఫిర్యాదులు చేసినా ఇప్పటికీ స్పందన లేదన్నారు. ఇప్పటికైనా అతడిపై చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.