హనుమకొండ, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజలిచ్చే తీర్పును అంచనా వేసుకుంటూ టెన్షన్ పడుతున్నారు. ఈ ఫలితాలను తమ పనితీరుకు నిదర్శనంగా చూపితే రాజకీయంగా దెబ్బతింటామని ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఎన్నికలు ఇప్పుడు పెట్టకపోవడమే మంచిదని అనుకుంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, అభివృద్ధి పనులు సైతం జరగడంలేదు. వానకాలం పంటలకు యూరియా దొరకక పడిగాపులు కాస్తున్న రైతులు వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పదేండ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న అన్నదాతలు స్థానిక ఎన్నికల్లో తగిన తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కోవడం రాజకీయంగా ప్రమాదమేనని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గందరగోళ రిజర్వేషన్లతో ఎన్నికలు వచ్చే అవకాశముండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో కలిపి 1702 గ్రామపంచాయతీలు, 775 ఎంపీటీసీ, 75 జడ్పీటీసీ స్థానాలున్నాయి. శాస్త్రీయ విధానం లేకుండా చేపట్టిన రిజర్వేషన్ల ప్రక్రియపై అన్ని వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించినప్పటికీ అక్టోబర్ 8న హైకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు ప్రక్రియ ఉండనున్నది. సంక్షేమ పథకాల నిర్వహణలో వైఫల్యం, అభివృద్ధి ఆగిపోవడం, గ్రామాల్లో కనీసం పారిశుధ్య నిర్వహణ లేకపోవడంతో ఎన్నికలపై అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళన పెరుగుతున్నది. నియోజకవర్గాల్లో చెప్పుకునే స్థాయిలో పనులు మంజూరు కాలేదని, ఇప్పుడు ఎన్నికలంటే ప్రజల తీర్పు ప్రతికూలంగా ఉంటుందని మదనపడుతున్నారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో అనేక హామీలిచ్చింది. అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది. బీఆర్ఎస్ అమలు చేసే పథకాలను మరింత విస్తృతం చేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పథకాన్ని కూడా మొదలుపెట్టలేదు. బీఆర్ఎస్ హయాంలోని సంక్షేమ పథకాల నిర్వహణలోనూ కాంగ్రెస్ సర్కారు విఫలమవుతున్నది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హులను కాకుండా పార్టీ కార్యకర్తలను, పలుకుబడి ఉన్న వారిని ఎంపిక చేసింది. దీంతో పేదల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత నెలకొన్నది.
అలాగే సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు వస్తే తమకు ఇబ్బందులు తప్పవని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మదనపడుతున్నారు. పింఛన్లను పట్టించుకోకపోవడం, అదనంగా ఒక్కరికి కూడా మంజూరు చేయకపోవడం వ్యతిరేకతకు దారితీసింది. ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో రెండేండ్లలో రాష్ట్రంలో లక్షల మంది చనిపోయారు.
కుటుంబ యజమానిని కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు వితంతు పెన్షన్లు ఇవ్వడంలేదు. ఆసరా పెన్షన్లను పెంచి అందిస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మరిచిపోయింది. మహాలక్ష్మి కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ పట్టించుకోవడంలేదు. యువత ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ప్రక్రియను నిలిపివేసింది.
పేద కుటుంబాలకు రూ.500 గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు (గృహజ్యోతి) పథకాలను పక్కనబెడుతున్నది. మొదట్లో కొందరికి అమలు చేసి తర్వాత ఒక్కో పథకాన్ని ఎగవేసేలా వ్యవహరిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శ్మశానవాటికలు, డంపింగ్ యార్డుల నిర్వహణ ఎక్కువ గ్రామాల్లో సరిగా లేదు. జీపీ ట్రాక్టర్లను మూలన పడేశారు. అధికార యంత్రాంగం ప్రణాళిక లేకపోవడంతో ఉపాధి హామీ పనులు సైతం సరిగా సాగడంలేదు.