గువహతి: స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. మంగళవారం నుంచి మొదలైన ఈ మెగా టోర్నీలో భాగంగా తొలి పోరులో సహ ఆతిథ్య దేశం శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. టోర్నీలో బోణీ కొట్టింది. వర్షం అంతరాయం వల్ల 47 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఉమెన్ ఇన్ బ్లూ.. 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. అమన్‌జోత్ కౌర్ (56 బంతుల్లో 57, 5 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (53 బంతుల్లో 53, 3 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. లంక బౌలర్లలో రణవీర (4/46) నాలుగు వికెట్లు పడగొట్టింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో లంక లక్ష్యాన్ని 271గా నిర్దేశించగా ఛేదనలో ఆ జట్టు.. 45.4 ఓవర్లలో 211 రన్స్‌కే చేతులెత్తేసింది. కెప్టెన్ చమారి ఆటపట్టు (43) టాప్ స్కోరర్. బ్యాట్‌తో మెరిసిన దీప్తి.. బంతి (3/54)తోనూ రాణించి లంక పనిపట్టింది. స్నేహ్ రాణా (2/54), అమన్‌జోత్ (1/37), క్రాంతి (1/41), తెలుగమ్మాయి శ్రీచరణి (2/37) ప్రత్యర్థిని కట్టడిచేశారు.
టాపార్డర్ వైఫల్యంతో 124 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయిన దశలో భారత జట్టును అమన్‌జ్యోత్, దీప్తి ఆదుకున్నారు. కీలక బ్యాటర్లు విఫలమైన చోట ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 103 పరుగుల శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్ఇండియాకు పోరాడేస్కోరును అందించారు. వన్డేల్లో అధ్బుత ఫామ్‌లో ఉన్న వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (8) నాలుగో ఓవర్లోనే నిష్క్రమించడంతో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కానీ ప్రతీక రావల్ (37), హర్లీన్ డియోల్ (48) రెండో వికెట్‌కు 69 రన్స్ జతచేశారు. అయితే రణవీర.. స్వల్ప వ్యవధిలో ప్రతీక, హర్లీన్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (21)తో పాటు జెమీమా రోడ్రిగ్స్ (0)ను పెవిలియన్‌కు పంపడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. రిచా ఘోష్ (2) సైతం ఆటపట్టు బౌలింగ్‌లో ఔట్ అవడంతో టీమ్ఇండియా కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అమన్‌జోత్.. దీప్తితో కలిసి పోరాడింది. లంక స్పిన్నర్లతో పాటు పేసర్లనూ సమర్థవంతంగా ఎదుర్కుని స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. 45 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్న ఈ మొహాలీ ఆల్‌రౌండర్.. ఆఖర్లో వేగంగా ఆడే క్రమంలో బౌండరీ లైన్ వద్ద విష్మి గుణరత్నె క్యాచ్ పట్టడంతో వెనుదిరిగింది. ఆమె స్థానంలో వచ్చిన స్నేహ్ రాణా (15 బంతుల్లో 28, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. పరిస్థితులకు తగ్గట్టు ఆడిన దీప్తి.. వన్డేల్లో 16వ హాఫ్ సెంచరీని సాధించింది.
ఛేదనలో లంకకు మెరుగైన ఆరంభమే దక్కింది. హాసిని (14)ని క్రాంతి ఏడో ఓవర్లో క్లీన్‌బౌల్డ్ చేసినా ఆటపట్టు వేగంగా ఆడటంతో 14 ఓవర్లలో ఆ జట్టు 80/1తో మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ దీప్తి రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 15వ ఓవర్లో ఆమె.. ఆటపట్టును క్లీన్‌బౌల్డ్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చింది. మరో ఎండ్‌లో శ్రీచరణి సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక స్కోరువేగం మందగించింది. 23వ ఓవర్లో చరణి.. హర్షిత (29)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. రెండో స్పెల్‌లో బౌలింగ్‌కు వచ్చిన అమన్.. 24వ ఓవర్లో విష్మి (11)ని పెవిలియన్‌కు పంపింది. దీప్తి 27వ ఓవర్లో కవిష (15).. రిచా ఘోష్ చేతికి చిక్కింది. మరుసటి ఓవర్లో ఆమె అనుష్క సంజీవని (6)నీ ఔట్ చేసి లంకను కోలుకోకుండా చేసింది.
భారత్: 47 ఓవర్లలో 269/8 (అమన్‌జోత్ 57, దీప్తి 53, రణవీర 4/46, ప్రబోధని 2/55);
శ్రీలంక: 45.4 ఓవర్లలో 211 ఆలౌట్ (ఆటపట్టు 43, నీలాక్షి 35, దీప్తి 3/54, రాణా 2/32)