KTR | రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు.. కానీ కొడంగల్‌కు మాత్రం తిరుపతి రెడ్డినే సీఎం అన్నట్లు ఉందని కేటీఆర్ అన్నారు. వార్డు మెంబరు, సర్పంచ్, కౌన్సిలర్ కూడా కానీ తిరుపతి రెడ్డికి కలెక్టర్లు, ఎస్పీలు వంగి వంగి దండాలు పెడుతున్నారని తెలిపారు. పోలీస్ ఎస్కార్ట్ తో ఆయన తిరుగుతున్నాడని పేర్కొన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీజేపీకి చెందని పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇవాళ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో కట్టించిన బిల్డింగులు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలకు మాత్రం రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డిలు రిబ్బన్ కట్ చేస్తున్నారు అందుకే జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారని అన్నారు. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డి కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క మంచి పని కూడా చేయలేదని అన్నారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సంతకంతో గ్యారెంటీ కార్డులను ఇచ్చి కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారని కేటీఆర్ అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా అందులోని ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదో చెబుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ బాకీ కార్డును తయారు చేసిందని తెలిపారు. 22 నెలల నుంచి నెలకు ₹2,500 ఇస్తామన్న హామీ ప్రకారం ప్రతి మహిళకు రూ. 55 వేల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడని తెలిపారు. స్థానిక ఎన్నికల ప్రచారం కోసం ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నేతలకు ఈ కాంగ్రెస్ బాకీ కార్డులను చూపించి బాకీ కట్టాలని తెలంగాణ ప్రజలు నిలదీయాలన్నారు. బాకీ కట్టి ఓటు అడగాలని నిలదీయండని సూచించారు. కాంగ్రెస్ మోసాల మీద బీఆర్ఎస్ వదిలిన బ్రహ్మాస్త్రమే “బాకీ కార్డు” అని స్పష్టం చేశారు.