Harish Rao | ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఏకంగా 15వేల కోట్ల పనులు అప్పనంగా అప్పగిస్తూ మరో స్కాంకు రేవంత్ సర్కార్ తెరలేపిందని అన్నారు. లక్షల కోట్లు విలువ చేసే, వేలాది ఎకరాల భూములను తన అనుయాయులకు దారాదత్తం చేసేందుకు రేవంతు మార్కు భారీ స్కెచ్ వేశారని మండిపడ్డారు.
ఓపెన్ బిడ్లు పిలవలేదు, అధికంగా బిడ్ దాఖలు చేసిన వారికి పనులు అప్పగించాల్సి ఉన్నా ఎక్కడా నిబంధనలు పాటించలేదని హరీశ్‌రావు అన్నారు. టెండర్లు పిలిచింది లేదు, నిబంధనలు పాటించింది లేదు.. కమీషన్లు దండుకునేందుకు వట్టి డంబాచారం, డబ్బా ప్రచారమని విమర్శించారు. ఇద్దరు, ముగ్గురిని మాత్రమే కన్సల్టెంట్స్ గా పెట్టుకొని పనులను సీక్రెట్‌గా ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇందులో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? ప్రభుత్వ భూములను, ప్రజా ధనాన్ని ఎవరికి దోచి పెడుతున్నారని నిలదీశారు. లగ్జరీ వెల్ నెస్ రిసార్ట్స్, వైన్ యార్డు రిసార్ట్స్, లగ్జరీ హోటల్స్, వాటర్ ఫ్రంట్ రిసార్ట్స్, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, థీమ్ పార్కుల అభివృద్ధి పేరిట మీరు చేస్తున్నది ముమ్మాటికీ స్కామే.. కమీషన్ల దందానే అని అన్నారు. ఈ స్కాం సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సహా త్వరలో బయటపెడుతామని తెలిపారు.
అధికారం శాశ్వతం కాదు, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఈ దోపిడీలో భాగమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని అన్నారు. ఈ మొత్తం స్కాంపై విచారణ జరిపిస్తం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.. పబ్లిక్ మనీని రికవరీ పెడుతామని హెచ్చరించారు.