Child Marriages | దేశంలో బాల్య వివాహాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (JRC) విడుదల చేసిన ‘టిప్పింగ్ పాయింట్ టు జీరో: ఎవిడెన్స్ టువార్డ్స్ ఎ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా’ నివేదిక ప్రకారం బాలికల్లో బాల్య వివాహాల రేటు 69 శాతం తగ్గింది. అలాగే, అబ్బాల్లో ఈ రేటు 72 శాతం పడిపోయిందని నివేదిక తెలిపింది. అత్యధికంగా అసోంలో బాల్య వివాహాల రేటు అత్యధికంగా 84శాతం తగ్గింది. ఈ సందర్భంగా సంస్థ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను ‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్’ అవార్డుతో స్కరించింది.న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ విడుదల చేసిన ఈ నివేదికను ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్ ఫర్ లీగల్ యాక్షన్ అండ్ బిహేవియరల్ చేంజ్ ఫర్ చిల్డ్రన్ (C-Lab) తయారు చేసింది.
బాల్య వివాహాలను నిరోధించడంలో అరెస్టులు, ఎఫ్ఐఆర్లు వంటి చట్టపరమైన చర్యలు ప్రభావవంతంగా పని చేశాయని నివేదిక పేర్కొంది. అసోం తర్వాత మహారాష్ట్ర, బిహార్‌లో 70శాతం, రాజస్థాన్‌లో 66శాతం, కర్నాటకలో 55శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది. గత మూడు సంవత్సరాల్లో బాల్య వివాహాల రేటులో అపూర్వమైన తగ్గుదల నమోదైందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయ ప్రయత్నాలతోనే ఇది సాధ్యమైందని నివేదిక తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 99శాతం మంది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రచారం గురించి ప్రభుత్వేతర సంస్థలు, పాఠశాలలు, పంచాయితీల అవగాహన ప్రచారాల ద్వారా విన్నామని, తెలుసుకున్నామని పేర్కొన్నారు. 2019-21 వరకు దేశంలో ప్రతి నిమిషానికి మూడు బాల్య వివాహాలు జరిగాయని, ప్రస్తుతం రోజుకు మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. నేడు బాల్య వివాహాలకు సంబంధించిన చట్టాల గురించి దాదాపు అందరికీ తెలుసునని.. కొద్ది సంవత్సరాల్లోనే ఇది ఊహించలేని మార్పు అని నివేదిక చెప్పింది.
2030 నాటికి బాల్య వివాహాలను నిర్మూలించడానికి కేంద్రం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తుండగా.. పలు ఎన్జీవోలు కీలక పాత్ర పోషించినట్లుగా తెలిపింది. ఈ సందర్భంగా జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిభు మాట్లాడుతూ భారతదేశం నేడు బాల్య వివాహాలను నిర్మూలించే దిశగా అడుగులు వేస్తోందని.. ఇది స్థిరమైన అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడమే కాదు.. అనివార్యమని కూడా తాము ప్రపంచానికి నిరూపించామన్నారు. ఇది కేవలం భారతదేశం విజయం కాదని.. ప్రపంచానికి ఒక బ్లూప్రింట్‌గా పేర్కొన్నారు. అయితే, సర్వే చేసిన అన్ని రాష్ట్రాల్లో 31శాతం గ్రామాల్లో 6-18 సంవత్సరాల వయసుగల బాలికలు పాఠశాలలకు వెళ్తున్నారని.. కానీ, గణనీయమైన అసమానతలు గమనించినట్లుగా నివేదిక తెలిపింది. మహారాష్ట్రలో బాలికలు 51శాతం గ్రామాల్లో పాఠశాలలకు వెళ్తుండగా.. బిహార్‌లో అందరూ బాలికలు 9శాతం గ్రామాల్లో మాత్రమే పాఠశాలలకు హాజరవుతున్నారు. 88శాతం పేదరికం, 47శాతం మౌలిక సదుపాయాల కొరత, 42శాతం భద్రత, 24శాతం రవాణాలేకపోవడం బాలికల విద్యకు ప్రధాన అడ్డంకులుగా నివేదిక తెలిపింది. 91శాతం మంది పేదరికం, 44శాతం మంది భద్రతను బాల వివాహానికి కారణాలుగా పేర్కొన్నారు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ప్రత్యేకంగా జాతీయ దినోత్సవం కార్యక్రమం నిర్వహించాలని నివేదిక సిఫారసు చేసింది. ఈ నివేదిక ఐదు రాష్ట్రాల్లోని 757 గ్రామాల నుంచి సేకరించి డేటా ఆధారంగా రూపొందించారు. దేశంలోని విభిన్న సామాజిక-సాంస్కృతిక సందర్భాలను ప్రతిబింబించేలా రాష్ట్రాలు, గ్రామాలు ఉండేలా చూసుకున్నారు. ఈ సర్వే మొదట ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాలల ఉపాధ్యాయులు, నర్సులు, పంచాయతీ ఉద్యోగుల నుంచి డేటాను సేకరించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా ‘చైల్డ్ మ్యారేజ్-ఫ్రీ వరల్డ్: బిల్డింగ్ ది కేస్ ఫర్ ప్రివెన్షన్, ప్రొటెక్షన్ అండ్ ప్రాసిక్యూషన్’ అనే ఈ ఉన్నత స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. రిపబ్లిక్ ఆఫ్ సియెర్రా లియోన్ ప్రథమ మహిళ మరియు ఐక్యరాజ్యసమితికి సియెర్రా లియోన్ శాశ్వత మిషన్ అయిన ఓఏఎఫ్ఎల్ఏడీ చైర్పర్సన్ డాక్టర్ ఫాతిమా మౌడా బయో కెన్యాతో కలిసి, వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్, జస్టిస్ ఫర్ చిల్డ్రన్ వరల్డ్‌వైడ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.