KTR | రేవంత్ రెడ్డి మీద కొడంగల్ ప్రజలకు కోపం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకొని ఉన్నారని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీజేపీకి చెందని పలువురు మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇవాళ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజల జోష్ చూస్తుంటే రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేయకుండా పారిపోయేలా ఉన్నాడని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ఎంత పెద్ద మోసగాడో కొడంగల్ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన కొడంగల్ గురించి శాసనసభలో రేవంత్ రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడాడడని మండిపడ్డారు. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు కొడంగల్లో ఉన్నాయంటూ అల్లుడి ఫ్యాక్టరీ కోసం భూములు తీసుకొని రైతుల పొట్టగొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. కొడంగల్ ఏమైనా రేవంత్ జాగీరా? రాజువా? అని నిలదీశారు. కొడంగల్ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యేగా గెలిచావు. ఢిల్లీకి మూటలు పంపి ముఖ్యమంత్రి అయ్యావని విమర్శించారు.
అహంకారపూరితంగా మాట్లాడిన ఎంతోమంది ఇవాళ అడ్రస్ లేకుండా కనుమరుగయ్యారని కేటీఆర్ గుర్తుచేశారు. కొడంగల్ ప్రజల ఆగ్రహంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కూడా అలానే అడ్రస్ లేకుండా కొట్టుకపోతారని మెచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి మూడేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను బ్రహ్మాండంగా బంపర్ మెజారిటీతో గెలిపించి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని సూచించారు.
రైతుల కోసం 40 రోజులు జైలుకుపోయిన నరేందర్ రెడ్డి ఒకవైపు, గెలిపించిన పాపానికి రోజు అవమానిస్తున్న తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డిలు ఇంకోవైపు ఉన్నారని తెలిపారు. కొడంగల్ ప్రజలు మళ్లీ మోసపోవద్దని సూచించారు. ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా, జడ్పీటీసీ అయినా, అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, కొడంగల్ ఒక ఎత్తు అని అన్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డికి తొడగొడితే ఢిల్లీ దద్దరిల్లుతుందని అన్నారు.. కొడంగల్ వాళ్లే రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు అని చెప్పారని ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తెలుస్తుందని అన్నారు. మళ్లీ కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఏ పని, ఏ హామీ అమలు చేయకపోయినా ప్రజలు తనను గెలిపించారని భావిస్తుందన్నారు. ఇక ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని డిసైడ్ అవుతాడని హెచ్చరించారు.
కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతుబంధు పైసలు పడేవని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రైతుబంధు పైసలు వేస్తున్నాడని తెలిపారు. ఏ సంక్షేమ పథకంలో కోతలు విధించాలా అని ప్రతిరోజు రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడని అన్నారు. లగచర్ల-హకీంపేట తండాలో రేవంత్ రెడ్డి ఆడపిల్లలను ఎంతగా అవమానించాడో కొడంగల్ ప్రజలు మర్చిపోవద్దన్నారు. తెలంగాణలోని మొత్తం ఆడపడుచులను వాళ్ళు అవమానించినట్టేనని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు మంచి అవకాశమని అన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి తీసుకువెళ్లాలని సూచించారు.