Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో పలువురు ‘ఐ లవ్ మహమ్మద్ (I Love Mohammad)’ ఆందోళనల పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడుతుండటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఆగ్రహం వ్యక్తంచేశారు. అరాచకాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని వారికి పరోక్ష హెచ్చరికలు చేశారు. తాము అందరినీ గౌరవిస్తామని, కానీ అమాయక పౌరులను ఇబ్బందులకు గురిచేసే వాళ్లను క్షమించబోమని వార్నింగ్ (Warning) ఇచ్చారు.
‘అరాచకం ఆమోదయోగ్యం కాదు. మేం అందరినీ గౌరవిస్తాం. మేం అందరికీ భద్రత కల్పిస్తాం. కానీ కొందరు భద్రతకు భంగం కలిగించే సాహసం చేస్తున్నారు. అమాయక పౌరులపై దాడులకు పాల్పడుతున్నారు. అలాంటి వారిపై రాబోయే తరాలకు కూడా గుర్తుండేలా తగిన చర్యలు తీసుకుంటాం’ అని యోగీ అదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.
పండుగలు, సంబరాల సందర్భంగా సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టడం మంచి పద్దతి కాదని యోగీ అన్నారు. ‘పండుగలు, సంబరాల సందర్భంగా మంచి వాతావరణాన్ని చెడగొట్టడం ఆమోదయోగ్యం కాదు. నేను మళ్లీ చెబుతున్నా.. ఎవరైనా రోడ్లపైకి వచ్చి అల్లర్లను సృష్టిస్తే వాళ్లు అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు’ అని హెచ్చరించారు.