రంగారెడ్డి, నవంబర్ 27 (నమస్తేతెలంగాణ): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోని ఓంకారేశ్వ ర ఆలయానికి సంబంధించిన 1,400 ఎకరాల విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని నందివనపర్తి గ్రామానికి చెందిన ప లువురు మంత్రి కొండా సురేఖకు లేఖ రాశారు. స్థానికులు నీలం సైదులు, పెండ్యాల మధుసూదన్, గోపి తదితరులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నందివనపర్తి గ్రామంలోని అతిపురాతనమైన ఓంకారేశ్వరస్వామి దేవాలయానికి 1,400 ఎకరాల అత్యంత విలువైన భూములు ఉన్నాయి.
ఈ భూములు నజ్దిక్సింగారం, కుర్మిద్ద, తాటిపర్తి, నందివనపర్తి గ్రామాల పరిధిలో ఉన్నాయి. ఈ భూములను కొన్నేండ్లుగా రైతులు కౌలు చేసుకుంటున్నారు. ఆలయానికి ఏమీ ఇవ్వటంలేదు. కౌలు తీసుకున్న కొంతమంది ఇతరులకు కౌలుకు ఇచ్చి వారినుంచి పెద్దమొత్తంలో తీసుకుని ఆలయానికి మాత్రం ఇవ్వటంలేదు. మరికొందరు ఆలయ భూములను అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో పాత కౌలుదారుల చెరనుంచి విడిపించి కొత్తవారికి అప్పగించి, ఆలయానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి రాసిన లేఖలో కోరారు.