హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ సర్కారు దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందని, రూ.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి బంధువులు 40 మందికి కారుచౌకగా కట్టబెడుతున్నదని మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పారదర్శకంగా హిల్ట్ పాలసీని రూపొందించామని చెప్తున్న ప్రభుత్వం.. దమ్ముంటే హైదరాబాద్ పారిశ్రామికవాడలోని 10 వేల ఎకరాల కేటాయింపులకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలని, తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హైదారాబాబ్ పారిశ్రామిక పార్కుల్లో పారిశ్రామికవేత్తలకు కేటాయించిన సుమారు 10 వేల ఎకరాల భూములను కారుచౌకగా కొట్టేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి స్కెచ్ వేశారని విమర్శించారు.
హిల్ట్ పాలసీ పేరిట రియల్ఎస్టేట్ దందాకు తెరలేపి తన బంధువులకు భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ పెరిగిందని, ఓఆర్ఆర్ దగ్గర ఎకరానికి రూ.137 కోట్ల ధర పలికిందని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మరి పారిశ్రామిక పార్కుల్లోని రూ.5 లక్షల కోట్ల విలువైన భూములను 30% ఎస్ఆర్వో విలువతో తన బంధుమిత్రులకు అప్పనంగా ఎందుకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు భూములు కట్టబెట్టిన వారి వివరాలు త్వరలోనే బయటపెట్టి, కుంభకోణాన్ని బట్టబయలు చేస్తామని ప్రకటించారు.
రేవంత్ ప్రభుత్వం పక్కా పథకం ప్రకారమే భూ దోపిడీకి తెరలేపిందని, అందుకే హిల్ట్ పాలసీని తీసుకొచ్చిందని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ‘నాచారం, బాలానగర్‌లో గజం భూమి ధర మార్కెట్ విలువ ప్రకారం రూ.1.5 లక్ష లు.. కానీ, సర్కారు మాత్రం గజానికి రూ.10 వేలకే అప్పగించేందుకు యత్నిస్తున్నది. ప్రభుత్వానికి ఎకరాకు కేవలం రూ.3 కోట్ల ఆదా యం వస్తే, భూములు దక్కించుకున్న సీఎం బంధుమిత్రులకు రూ.30 కోట్ల లాభం వస్తుంద’ని ఆరోపించారు. మంత్రులకు వాటాలు ఇచ్చి నోరెత్తకుండా చేస్తున్నారని విమర్శించారు. వారంలోనే అప్లికేషన్‌కు గడువు పెట్టి 45 రోజుల్లోనే నగదు మొత్తం చెల్లించాలని నిర్ణయించడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు.
హిల్ట్ పాలసీ ముసుగులో భూములను ఇష్టమొచ్చినవారికి ఇష్టారాజ్యంగా పంచిపెడుతున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అక్రమ వ్యవహారానికి సహకరించిన వారికి తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితిలో పారిశ్రామికవాడల్లోని భూములను కాపాడుకుంటామని, ఇందుకోసం బీఆర్ఎస్ ఆధ్వర్వంలో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఇప్పటికైనా హిల్ట్ పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
థర్మల్ విద్యుత్తు ఉత్పత్తిపై నాడు అడ్డగోలు గా మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఆక్షేపణీయమని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నాడు అభ్యంతరాలు చెప్పి ఇప్పుడు ఎందుకు అడు గు ముందుకేస్తున్నారని ప్రశ్నించారు. థర్మల్ పవర్ జనరేషన్‌పై కాంగ్రెస్ విధానమేమిటో వెంటనే స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ దిష్టి తగలడంతోనే కోనసీమలో కొబ్బరిచెట్లు ఎండిపోయాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. కనీస పరిజ్ఞానం లేని వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వాస్తవానికి తెలంగాణలోని సంపదపై ఆంధ్రా వారి దిష్టి తగులుతుందని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, అనంత్ పాల్గొన్నారు.