రంగారెడ్డి, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : నాటకీయ పరిణామాల మధ్య రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రెండోసారి వాయిదా పడింది. హైకోర్టు నుంచి స్టే వచ్చిందని, ఒక్క ఫోన్‌కాల్‌తో అధికారులు ఎన్నిక ప్రక్రియను అర్ధంతరంగా నిలిపివేశారు. స్టే ఆర్డర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వస్తున్నాయని చెప్పి కౌన్సిలర్లను ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మున్సిపల్ కార్యాలయంలోనే ఉంచారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి లేకుండా ఎన్నిక జరుపవద్దని ఆయన కుమారుడు హరికాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో యాదగిరి లేకుండా ఎన్నిక జరుపవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
యాదగిరి మంగళవారం బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఓటింగ్‌లో పాల్గొనేందుకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా 11గంటలకు యాదగిరితో అధికారులు కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 7వ వార్డు కౌన్సిలర్ సుదర్శన్‌రెడ్డిని ప్రతిపాదించారు. దీనికి 13మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర, ఒక బీజేపీ కౌన్సిలర్ మద్దతు తెలిపారు. దీంతో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది.
వైస్‌చైర్మన్ ఎన్నిక జరుపుతుండగానే ఎన్నిక ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు నుంచి జీపీ ద్వారా ఎన్నికల కమిషన్‌కు, కలెక్టర్‌కు, ఎన్నికల అధికారికి ఫోన్‌కాల్ ద్వారా సమాచారం వచ్చింది. వెంటనే ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన మయాంక్ మిట్టల్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. కోర్టు స్టే పూర్తిస్థాయి కాపీ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆర్డీవోకు చెప్పారు. అప్పటికే ఈసీ నుంచి కూడా సమాచారం రావడం వల్లే ఎన్నిక ప్రక్రియ నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఆర్డర్ కాపీ తమకు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఒత్తిడి తేవడంతో సాయంత్రం 6గంటల తర్వాత ఇస్తామని ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు.
ఒక్క ఫోన్‌కాల్‌తో ఎన్నిక నిలిపివేత
ఇబ్రహీంపట్నం మున్సిపల్లో 24 వార్డులున్నాయి. బీఆర్ఎస్ 13 వార్డుల్లో గెలిచింది. ఒక స్వతంత్ర, ఒక బీజేపీ కౌన్సిలర్ మద్దతు ప్రకటించటంతో బీఆర్ఎస్ బలం 15కి చేరింది. కాంగ్రెస్ ఎనిమిది కౌన్సిలర్లతో పాటు ఒక బీజేపీ కౌన్సిలర్, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో 10మంది మాత్రమే ఉన్నారు. బీఆర్ఎస్కు పూర్తిస్థాయి మద్దతు ఉన్నది. సోమవారం 12మంది బీజేపీ కౌన్సిలర్లతో పాటు స్వతంత్ర అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి కూడా సమావేశంలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి సమావేశానికి రాకపోవటంతో ఆయన కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నాయకులు హైడ్రామా సృష్టించి యాదగిరి లేకుండా ఎన్నిక జరుపవద్దని గందరగోళ పరిస్థితులు సృష్టించారు. దీంతో అధికారులు ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. ఈలోగా యాదగిరిని బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారని, ఆయన లేకుండా ఎన్నిక జరుపవద్దని కాంగ్రెస్ నాయకులు యాదగిరి కుమారుడితో హైకోర్టులో పిటిషన్ వేయించారు. కానీ మంగళవారం యథావిధిగా బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ఆకుల యాదగిరి కూడా చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు హాజరయ్యారు. ఈ లోగా కోర్టు స్టే ఆర్డర్ వచ్చిందని, ఎన్నిక నిలిపివేశారు. వాట్సాప్ మెసేజ్ ద్వారా హైకోర్టు ప్రాథమిక సమాచారాన్ని ఎన్నికల అధికారులకు అందించారు. ఎన్నిక నిలిపివేతకు గల కారణాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టగా, కొంత గందరగోళం నెలకొన్నది.