సారంగాపూర్, ఫిబ్రవరి 17 : ఈ-పంచాయతీ ఆపరేటర్లకు నాలుగు నెలలుగా వేతనాలు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జి ల్లాలో 396 గ్రామ పంచాయతీలు ఉండగా.. క్లస్టర్ పంచాయతీ కేంద్రాలు, మండల పరిషత్ కార్యాలయాల్లో 37 మంది ఆపరేటర్లు పని చేస్తున్నారు. పంచాయతీల వివరా లు కంప్యూటర్లో నమోదు చేయడం, ధ్రువీకరణ వపత్రాల జారీ నుంచి ప్రభుత్వ పథకాల దరఖాస్తుల నమో దు వరకు పనులు నిర్వహిస్తున్నారు. ఒక్కో మండలం లో ఇద్దరు నుంచి ముగ్గురు వరకు ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. 4 నెలల నుంచి ప్రభుత్వం వేతనాలు మం జూరు చేయకపోవడంతో ఆర్థికంగా, కుటుంబ పోషణ భా రంగా మారిందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనంలో కోత
గతంలో నెలకు రూ.22,750 చొప్పున ఆయా పంచాయతీల నుంచి వేతనాలను ఎంపీడీవోలు సర్దుబాటు చేసేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది 2024 డిసెంబర్ వరకు చెల్లింది. 2025 జనవరి నుంచి రూ.3,250 కోత విధించి రూ.19,500 వేతనం చెల్లిస్తున్నది. ప్రతినెల కాకుండా రెండు, మూడు నెలలకోసారి చెల్లిస్తుండడంతో ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని ఆపరేటర్లు కోరుతున్నారు.
వేతనాలు చెల్లించాలి..
ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లుగా ఈ-పంచాయతీ ఆపరేటర్లుకు ప్రభుత్వం ప్రతినెల వేతనాలు చెల్లించాలి. నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొటున్నాం. కుటుంబాలను పోషించుకొనేందుకు అప్పులు చేయాల్సి వస్తున్నది. ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేసి ఆపరేటర్లను ఆదుకోవాలి. ప్రతి నెల వేతనంలో కోత విధించకుండా రూ.28,500 ఖాతాలో జమ చేయాలి. పీఎఫ్ సౌకర్యం కల్పిండంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలి. పని భారాన్ని తగ్గించాలి.
– బీ సునీల్, జిల్లా అధ్యక్షుడు, ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం, నిర్మల్