Rahul Gandhi : దేశంలోని సైనిక స్కూళ్లను ప్రైవేటీకరించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సైనిక్ స్కూళ్లను ఆర్ఎస్ఎస్కు అప్పగిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఆన్ డిఫెన్స్ మెంబర్స్‌కు సంబంధించిన సమావేశం మంగళవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి ఈ కమిటీలో సభ్యులైన కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, కార్తీ చిదంబరం, పవన్ ఖేరా, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, బీజేపీ ఎంపీలు రాధా మోహన్ సింగ్, సుధాన్షు త్రివేదితోపాటు పలువురు సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సైనిక్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సైనిక్ స్కూళ్లను ప్రైవేటీకరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అనేక సైనిక స్కూళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని, ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్తో సంబంధం కలిగిన వారి చేతుల్లో విద్యాసంస్థల్ని పెడుతున్నారని రాహుల్ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్ని బీజేపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. దీనిపై ఆధారాలుంటే సమర్పించాలని రాహుల్‌కు సూచించారు. సరైన ఆధారాలు, డాక్యుమెంట్లు లేకుండా ఆరోపణలు చేయడం తగదని సూచించారు.
రాహుల్ చేసిన ఆరోపణలపై ఈ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణ జరుగుతుందన్న అంశంపై ప్రభుత్వం నుంచి పూర్తి నివేదిక కావాలని ఆయన కోరారు. ఈ అంశంలో ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉందనేదానిపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.