హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : రాష్ట్రం లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జోరందుకున్నది. తొలి విడత ఎన్నికల నిర్వహణకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మందా మకరందు నోటిఫికేషన్ జారీచేశారు. తొలి విడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు రిటర్నింగ్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల తుది జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డులపై అతికించారు. తొలిరోజు 31 జిల్లాల్లోని 4,236 సర్పంచ్ స్థానాలకు 3,242, 37,440 వార్డులకు 1,821 నామినేషన్లు దాఖలైనట్టు ఎస్ఈసీ గురువారం వెల్లడించింది. తొలి రోజు సర్పంచ్ స్థానాల కంటే కూడా వార్డులకు తక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. 29న సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న పరిశీలన, అదే రోజు సాయంత్రం 5గంటలకు చెల్లుబాటైన నామినేషన్ల(అభ్యర్థుల) వివరాలు ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు అవకాశం ఉంది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బరిలో నిలిచి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత 2గంటల నుంచి ఓట్లు లెక్కించి అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఉప సర్పంచ్‌ను సైతం అదే రో జు ఎన్నుకుంటారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పంచాయతీ బరిలో నిలువాలనుకొనే అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. ధర్మాపూర్ క్లస్టర్లో నామినేషన్ పత్రాలు లేక అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నామినేషన్ కేంద్రం నుంచి పత్రాలు తీసుకెళ్లేందుకు ఇస్తాపూర్కు చెందిన పలువురు అభ్యర్థులు గురువారం వచ్చారు. వారికి ఇచ్చేందుకు పత్రాలు లేక గంటల తరబడి ఎండలో మహిళలు కూడా పడిగాపులు కాశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
