Rayapole alumni | రాయపోల్, జనవరి 12 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో 2005–2006 విద్యాసంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యాభ్యాసం పూర్తయి 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకుని తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఈ సందర్భంగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని తమ బాగోగులు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆనాటి రోజుల్లో విద్యాబుద్ధులు నేర్పి జీవితానికి దిశానిర్దేశం చేసిన గురువులను అందరూ కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. గురువుల మార్గదర్శకత్వమే తమ ఉన్నతికి బాటలు వేసిందని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.
ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలాంటి సమ్మేళనాలు స్నేహబంధాలను మరింత బలపరుస్తాయని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.