నర్సంపేట : నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న తక్కలపల్లి రవీందర్ రావు (Takkalpalli Ravinder Rao ) నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
రవీందర్ రావు పదేళ్లుగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్‌గా, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఆయన రెండుసార్లు ఎంపీపీగా , సింగిల్ విండో చైర్మన్‌గా పనిచేసి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు , మోసపూరిత వైఖరిని నిరసిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఈ చేరిక నర్సంపేట నియోజకవర్గ రాజకీయాల్లో, ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ , ఖానాపురం మండలాల్లో బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా నిలుస్తుందని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న రవీందర్ రావు పార్టీలోకి రావడం శుభపరిణామమని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత పటిష్టం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.