మహబూబ్నగర్ : పోయిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన పొరపాట్లను మళ్లీ చేయొద్దని పార్టీ శ్రేణులకు, ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పోతే మన ఎమ్మెల్యే పోతడుగానీ రాష్ట్రంలో మాత్రం కేసీఆరే ముఖ్యమంత్రి అయితడు అనే ఆలోచనతో జనం అవతలి పార్టీలకు ఓటేశారని, దాదాపు చాలా నియోజకవర్గాల్లో అదే జరగడంతో అధికారం కోల్పోయామని ఆ పొరపాట్లు రిపీట్ కానీయొద్దని ఆయన చెప్పారు. ఈ దుర్మార్గుల పాలనతో మనకు మంచి జరగదని అన్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన కేటీఆర్.. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే మంచి జరుగుతదని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. ‘రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను తప్పించుకోనికి బూతులు మాట్లాడుతున్నడు. రైతులకు రూ.15 వేల రైతు భరోసా ఇస్త అంటివి ఏది..? అంటే.. నీ లాగుల తొండలు ఇడిసిపెడుత అంటడు. మహిళలకు రూ.2,500 ఏవి..? అంటే నీ గుడ్లు పీకి గోటీలు ఆడుత అంటడు. తులం బంగారం ఏదిరా నాయినా..? అంటే నీ పేగులు తీసి మెడల ఏసుకుంట అంటడు. తిట్లు ముంగటేసుకుంటడు. మాకు రావా తిట్లు..? ఆయనకన్న ఒక్కటే భాష వస్తది. నాకు నాలుగు భాషలు వస్తయ్. తిట్టమంటే పొల్లుపొల్లు తిడుత. మంచిగుండదని ఊకుంటన్న’ అని తెలిపారు.
‘పోయిన ఎన్నకలప్పుడు పోతే మా ఎమ్మెల్యే పోతడుగానీ, ముఖ్యమంత్రి కేసీఆరే అయితడని మీరు అవతలి వ్యక్తి ఓటేసిండ్రు. అట్ల దాదాపు చాలా నియోజకవర్గలల్ల అనుకునేసరికి చాలామంది ఓడిపోయిండ్రు. ఎమ్మెల్యేలు అందరు ఓడిపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితడు..? కాబట్టి ఈసారి అసుంటి పొరపాట్లు చేయకండి. కారు గుర్తు మీద ఏ అభ్యర్థి పోటీచేసినా కేసీఆర్ అన్ని ఆలోచించే ఆయనకు టికెట్ ఇచ్చిండనే నమ్మకంతోటి గెలిపించండి. మున్సిపల్ ఎన్నికల్లో, జడ్పీటీపీ ఎన్నికల్లో, చివరగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు గుద్దండి’ అని పిలుపునిచ్చారు.
‘పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులు మున్సిపాలిటీలకు రావాలె. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలె. ‘మనకు మంచి జరగాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలె’ అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ దుర్మార్గులు అధికారంలో ఉన్నంత కాలం మనకు మంచి జరుగదు. మీకు దండంపెట్టి చెబుతున్నా మున్సిపల్ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుకావాలె. ఈ జైత్రయాత్ర అసెంబ్లీ ఎన్నికలదాకా అట్లనే కొనసాగాలె’ అని కేటీఆర్ కోరారు.