Anil Ravipudi | సంక్రాంతి సీజన్లో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న అతికొద్ది యువ దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు అనిల్ రావిపూడి. ఎస్ఎస్ రాజమౌళి తర్వాత బాక్సాఫీస్ వద్ద సింగిల్ ఫెయిల్యూర్ కూడా చూడని డైరెక్టర్‌గా అరుదైన రికార్డ్ అనిల్ రావిపూడి ఖాతాలో ఉంటుంది. ఇప్పటికే 8 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడి తాజాగా చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన మన శంకర వర ప్రసాద్ గారుతో తొమ్మిదో హిట్ కూడా వేసుకున్నాడు.
సంక్రాంతి ఫెస్టివ్ సీజన్ అంటే అనిల్ రావిపూడి సినిమా అని ఫిక్సయిపోవాల్సిందేనని మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ డైరెక్టర్‌తో ఎవరు సినిమా చేసినా వారికి హిట్టు పడ్డట్టేననడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి ల్యాండ్ మార్క్ సినిమాగా రాబోతున్న పదో ప్రాజెక్టుపై ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. 2026 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయిపోవడంతో మూవీ లవర్స్ అంతా 2027 సంక్రాంతి సినిమా గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ అనిల్ రావిపూడి తన పదో సినిమాను ఏ యాక్టర్‌తో తీస్తాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల ఓ చిట్ చాట్ సెషన్లో తాను నాగార్జునతో కలిసి పనిచేయాలనుందని హింట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం నాగార్జున తన ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ 100వ సినిమ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఒకవేళ నాగార్జున, అనిల్ రావిపూడి సినిమాకు ఒకే అంటే మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయమైనట్టే. ఇదే నిజమైతే టాలీవుడ్లో నలుగురు సీనియర్ స్టార్హీరోలతో సినిమా చేసిన అరుదైన క్రెడిట్ అనిల్ రావిపూడి ఖాతాలో చేరిపోనుందన్నమాట. మరి రాబోయే రోజుల్లో నాగ్-అనిల్ రావిపూడి కాంబో ఒకే అవుతుందేమో చూడాలి.