– విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు
పాల్వంచ, జూన్ 06 : కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసినా కూడా పాల్వంచ పట్టణంలో తాగు నీటి కష్టాలు తీరలేదని, అనేక డివిజన్లలో కనీసం రెండు రోజులకు ఒకసారి కూడా తాగేందుకు నీళ్లు రాని పరిస్థితి నెలకొందని, అంతేకాకుండా ఇచ్చే రెండు రోజులకోసారి కూడా సురక్షితమైన తాగునీరు అందించడంలో అధికారులు పూర్తి విపలమయ్యారని, కొన్ని ప్రాంతాల్లో డ్రైన్లలో నీరు లీకేజీల వల్ల మురుగునీరు కలిసి కలుషిత నీరు సరఫరా జరుగుతోందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కిలారు నాగేశ్వర్రావు విమర్శించారు. శనివారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల మురుగు నీరు అంతా రోడ్లమీదే ప్రవహిస్తుందన్నారు. మురుగు కాల్వలను శుభ్రం చేయకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికే మురుగునీరంతా రోడ్లపైకి చేరుతోందని తెలిపారు. దీనివల్ల దోమల ఉధృతి పెరిగి, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. అలాగే అనేక డివిజన్లలో వీధిలైట్లు కూడా వెలగని దుస్థితి నెలకొందన్నారు. చీకటిని ఆసరాగా చేసుకుని దొంగతనాలు పెరుగుతున్నాయన్నారు. రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని ఆరోపించారు.
పట్టణంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గుంపులు గుంపులుగా తిరుగుతూ చిన్న పిల్లలపై, వాహనదారులపై దాడులు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై వెళ్లాలంటేనే జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తోందని తెలిపారు. చాలా డివిజన్లలో ప్రధాన రహదారులే కాకుండా, కాలనీల్లోని అంతర్గత రోడ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు చెప్పారు. కొత్త రోడ్ల నిర్మాణం దేవుడెరుగు, కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయడం లేదని విమర్శించారు. రోడ్లపై గుంతలతో కాలనీవాసులు నరకం చూస్తున్నారని, నిత్యం ప్రయాణికులతో రద్దిగా ఉండే పాల్వంచ బస్టాండ్ ఏరియాలో అపరిశుభ్రత సీజన్లలకు అతీతంగా నిత్యం కనిపిస్తుందనే అక్కడ చెట్ల పైన గుంపులుగా గబ్బిలలు వేలాడుతూ, కంపు వాసనతో వాటి అరుపులతో అనేక ఇబ్బందులు కలుగుతున్నట్లు తెలిపారు.
వీటి వల్ల అనేక వైరస్ లు సోకే ప్రమాదం ఉందన్నారు. ప్రధాన రహదారులపై మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్లకోసం తవ్విన కాల్వలను పుడ్చడంలో, డ్రైనేజీల కోసం తవ్విన పనుల్లో జాప్యం వల్ల నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల వద్ద నుండి పన్నుల వసూళ్లలో ఉన్న శ్రద్ధ, సౌకర్యాల కల్పనలో లేదని, ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ సమస్యలపై కార్పొరేషన్ చైర్మన్, కమిషనర్, సిబ్బంది స్పందించాలని, లేనిపక్షంలో కార్పొరేషన్ పాలనపై నిత్యం పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాల్వ ప్రకాశరావు, దాసరి నాగేశ్వరావు, ఆర్కే పాల్గొన్నారు.