Virat Kohli : ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టులోకి యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiwal) ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. గాయపడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virot Kohli) స్థానంలో అతడిని జట్టులోకి తీసుకుంటున్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarker) ప్రకటించారు. జైస్వాల్ తన చివరి వన్డేలో సౌతాఫ్రికాపై అజేయ సెంచరీ (116 పరుగులు, నాటౌట్) తో అదరగొట్టడం విశేషం. ఇదే సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఆడటం వారి ఫిట్నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు స్పష్టంచేశారు.
వెన్నునొప్పితో బాధపడుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లో రిహాబిలిటేషన్‌లో ఉండగా.. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ కూడా త్వరలో అక్కడికి చేరుకుని ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నప్పుడు కోహ్లీకి తొడ కండరానికి గాయమైంది. ఆ మ్యాచ్‌లో 75 పరుగులతో జట్టును గెలిపించినప్పటికీ ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువవడంతో అతడు ఈ సిరీస్‌కు దూరమవాల్సి వచ్చింది.
జూలైలో జరిగే ఇంగ్లండ్ వన్డే సిరీస్ నాటికి కోలుకునే అవకాశం ఉందని అగార్కర్ చెప్పారు. భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య వన్డే పోరు జూన్ 13న ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత మిగిలిన రెండు వన్డే మ్యాచ్‌లు జూన్ 17న లక్నోలో, జూన్ 20న చెన్నైలో నిర్వహించనున్నారు. ఈ సిరీస్ ముగిసిన తర్వాతే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పూర్తిస్థాయి భారత వన్డే జట్టును సెలెక్టర్లు ప్రకటించనున్నారు. రోహిత్, హార్దిక్‌లు ఫిట్నెస్ సాధిస్తేనే ఈ సిరీస్‌లో ఆడతారని, లేదంటే జట్టులో మరికొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.