కారేపల్లి, జూన్ 06 : కారేపల్లి మండల కేంద్రమైన కారేపల్లిలో రైల్వే డబ్లింగ్లో భూములు కోల్పోతున్న వారందరికీ గ్రామ సభలో ప్రకటించిన విధంగా పరిహారాన్ని చెల్లించాలని నిర్వాసిత బాధితులు సాదిక్ అలీ- రాహద్ బేగం దంపతులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గల తమ నివాసంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. డోర్నకల్- భద్రాచలం రోడ్డు రైలు మార్గంలో రెండవ లైన్ నిర్మించుటకు రైల్వే అధికారులు భూమిని సేకరించడం జరిగిందన్నారు. అందులో భాగంగా కారేపల్లి గ్రామంలో గల గ్రామ కంఠంలో ఉన్న 16 మంది ఇండ్ల స్థలాలను కోల్పోతున్నట్లు తెలిపారు. ఈ విషయమై సంబంధిత అధికారులు కారేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను ఏర్పాటు చేసి ప్రస్తుతం మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం అధికారులు వ్యవసాయ భూమిగా పరిగణించి తక్కువ రేటును కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ విషయమై ఇప్పటికే ఉన్నతాధికారులను కలిసి వివరించినట్లు చెప్పారు. గ్రామ సభలో ప్రకటించిన విధంగా నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.