AR Rahman | ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జూన్ 7వ తేదీన అట్టారీ సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) వీరులకు సంగీత రూపంలో ఘన నివాళి అర్పించనున్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న బీఎస్ఎఫ్ జవాన్ల ధైర్యసాహసాలు, త్యాగాలు మరియు నిబద్ధతకు కృతజ్ఞతగా ‘మేన్ వాపస్ ఆవుంగా’ చిత్ర బృందంతో కలిసి ఆయన ఈ ప్రత్యేక ప్రదర్శనను ఇవ్వనున్నారు. ‘జై హో – ఎ ట్రిబ్యూట్ టు ది బ్రేవ్‌హార్ట్స్’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ గ్రహీత ఏఆర్ రెహమాన్‌తో పాటు దర్శకుడు ఇంతియాజ్ అలీ, యువ నటుడు వేదాంగ్ రైనా మరియు చిత్ర గాయకులు మోహిత్ చౌహాన్, పూజా తివారీ, నర్గిస్ కూడా పాల్గొననున్నారు. అట్టారీ బోర్డర్లోని జేసీపీ స్టేడియంలో ప్రతిరోజూ జరిగే ఐకానిక్ పరేడ్ వేడుకల సమయంలో, సాయంత్రం 4:30 గంటల నుండి 5:30 గంటల మధ్య ఈ అద్భుతమైన ప్రదర్శన జరగనుంది. దేశభక్తి, సంగీతం మరియు భావోద్వేగాల కలయికగా సాగనున్న ఈ వేడుక సరిహద్దులో ఒక మరపురాని అనుభూతిని మిగల్చనుంది.
ఇక ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచిన ‘మేన్ వాపస్ ఆవుంగా’ చిత్రం 1947 నాటి భారత దేశ విభజన నేపథ్యంలో సాగే ఒక పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రేమ, ఎడబాటు, వలసలు మరియు జ్ఞాపకాల చుట్టూ ఈ చిత్ర కథాంశం తిరుగుతుంది. చారిత్రక పరిణామాల వల్ల ఒక ప్రేమజంట జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను ఈ సినిమాలో ఎంతో భావోద్వేగభరితంగా చూపించనున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఇంతియాజ్ అలీ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ప్రముఖ గీత రచయిత ఇర్షాద్ కామిల్ల క్రేజీ కాంబినేషన్ మరోసారి పునరావృతం కాబోతోంది. ఈ సినిమాలో షర్వారీ, నసీరుద్దీన్ షా, వేదాంగ్ రైనా మరియు దిల్జిత్ దోసాంజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, విండో సీట్ ఫిల్మ్స్ మరియు మోహిత్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుంది. భారత్ మరియు పాకిస్తాన్ భద్రతా దళాలు 1959 నుండి ప్రతిరోజూ అట్టారీ-వాఘా సరిహద్దులో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పరేడ్ వేడుకల్లో భాగంగా ఈ సంగీత కార్యక్రమం జరగనుండడం విశేషం.