Multi Starrer | తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వీరి అనుబంధం అభిమానులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది. బాక్సాఫీస్ వద్ద పోటీ పడినా, అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరిగినా.. వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా మెలుగుతుంటారు.అయితే ఇంతటి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పటివరకు ఒకే సినిమాలో కలిసి నటించకపోవడం అభిమానులను ఎప్పుడూ నిరాశపరిచే అంశమే. కానీ ఇప్పుడు ఈ కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం వరుస విజయాలతో స్టార్ దర్శకుడిగా కొనసాగుతున్న అనిల్ రావిపూడి మరో భారీ మల్టీస్టారర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వెంకటేష్–కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన, ఆ సినిమా పూర్తయ్యాక చిరంజీవి–నాగార్జున కాంబినేషన్లో ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఒక ఆసక్తికరమైన స్టోరీ లైన్ కూడా సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్త అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇటీవల విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో చిరంజీవి, వెంకటేష్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూపించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న అనిల్ రావిపూడి, ఇప్పుడు మరోసారి ఇద్దరు అగ్ర హీరోలను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారనే వార్త మరింత హాట్ టాపిక్‌గా మారింది. విభిన్నమైన వినోదాత్మక కథలతో ప్రేక్షకులను అలరించే అనిల్ రావిపూడి, చిరంజీవి–నాగార్జున ఇమేజ్‌కు తగ్గ కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి, నాగార్జున కలిసి నటిస్తే అది టాలీవుడ్లోనే అత్యంత క్రేజీ మల్టీస్టారర్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇద్దరి స్టార్డమ్, అనిల్ రావిపూడి కామెడీ టచ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.