కట్టంగూర్, సెప్టెంబర్ 11 : దొంగతనం కేసులో పార్థీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించినట్లు కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి బెల్లి నర్సింహ్మ 2024 జూన్ 15వ తేదీ రాత్రి ఇంటిపైన నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అనంతరం బీరువాను ధ్వంసం చేసి బంగారు, వెండి వస్తువులను అపహరించుకు పోయారు. దీంతో బాధితుడు నర్సింహ్మ 2024 జూన్ 16న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ నన్నెపంగ శ్రీను కేసు నమోదు చేశాడు.
చిట్యాల సీఐ నాగరాజు విచారణ చేపట్టి పార్దీ గ్యాంగ్ కు చెందిన అప్పపాండు రంగా పవార్, శుభమన్ అశోక్ పవార్ ను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. పూర్తి సమాచారాన్ని కోర్టులో ఫైల్ చేశాడు. దీనిపై నకిరేకల్ మున్సిఫ్ కోర్టులో వాదనలు ముగియగా నేరస్థులకు తేలిన ఇద్దరికి 18 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి షేక్ ఆరీఫ్ తీర్పు వెలువరించారు.