రామగిరి, సెప్టెంబర్ 11 : గ్రూప్-1 పరీక్షలో చోటుచేసుకున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మర బోయిన నాగార్జున ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ ల పార్టీ అన్నారు. అధికారంలోకి రావడానికి విద్యార్థులను పావుగా వాడుకుని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హైదారబాద్ అశోక్ నగర్ లైబ్రరీ సాక్షిగా వాళ్ల అధినాయకుడు రాహుల్ గాంధీతో ప్రకటన చేపించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
ఇప్పటికైనా మాయ మాటలు ఆపి విద్యార్థులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్, అదేవిధంగా మెగా డీఎస్సీ నిర్వహించి యూత్ డిక్లరేషన్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు విజయ్, నోముల క్రాంతి యాదవ్, కిరణ్ కుమార్, వెంకట్, కృష్ణ, శ్రీకాంత్, రమేష్, యుగంధర్, నగేష్, లింగస్వామి, శ్రీశైలం, వర్షిత, రేణుక, అంజలి, శ్రీదేవి, సంధ్య పాల్గొన్నారు.