‘సమస్యల వైరస్’తో బాధపడుతున్న 108 ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీ సమగ్రాభివృద్ధికి ‘నిధుల వ్యాక్సిన్’ వేసి ఆక్స్ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీల సరసన నిలుపుతామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఓయూ విద్యార్థులుగా స్వాగతిస్తున్నాం. అయితే, వర్సిటీ పునర్ వైభవ అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్ రూపకల్పనలో గోప్యత పాటిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది.
తనను తాను నల్లమల పులిగా అభివర్ణించుకొనే రేవంత్ గత ఆగస్టు 25న పోలీసు ఇనుప కంచెల నడుమ తొలిసారి ఓయూకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘విద్యారంగంలో మార్పులు-ప్రభుత్వ ప్రణాళిక’ అనే అంశంపై సమగ్రంగా మాట్లాడాల్సిన ఆయన, అందుకు భిన్నంగా రాజకీయ ప్రసంగం చేసి తన సహజ స్వభావాన్ని చాటుకున్నారు. ప్రణాళికలు, నిధుల ప్రకటన, అభివృద్ధి నమూనా అంశాలపై ఏ మాత్రం స్పష్టత ఇవ్వకుండా ‘కొండంత రాగం తీసి కూసింత పాట పాడిన’ చందంగా ఇంజినీర్ల కమిటీ ఏర్పాటుకు ఆదేశించి, ఆడిటోరియం నుంచి సెలవు తీసుకున్నారు. ఇక, విద్యార్థుల అభిప్రాయాలకు కనీసం చోటు కల్పించని ఉన్నతస్థాయి కమిటీ (కేకే కమిటీ) రూపొందించిన ప్రణాళికల కాగితాలను చేబూని రేవంత్ 2వ పర్యాయం ‘తెలంగాణ రైజింగ్ ఉత్సవాల’ పేరుతో వర్సిటీలో కాలుమోపుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం ‘హస్త’గతం చేసుకోవడంలో విద్యార్థులు, నిరుద్యోగుల మద్దతే అత్యంత కీలకమైనది. అయితే, వర్సిటీల అభివృద్ధికి గత 2024-25 వార్షిక బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించి రేవంత్ సర్కార్ మొదట్లోనే మొండి‘చేయి’ చూపింది. ఓయూలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఐక్యంగా శాంతియుత పద్ధతుల్లో పలుమార్లు నిరసనలు తెలిపాయి. ఈ సందర్భంలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా వర్సిటీ అధికారులు నిషేధాజ్ఞలతో కూడిన ఓ సర్క్యులర్‌ను విడుదల చేశారు. వర్సిటీ ప్రాంగణాల్లో నిరసనలు, నినాదాలు, ఆందోళనలు నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయనే హెచ్చరికను ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఇది ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ హక్కును కాలరాయడమే కదా?
‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ తమ 7వ గ్యారెంటీగా ప్రకటించుకున్న రేవంత్‌రెడ్డి.. వర్సిటీలో నిషేధాజ్ఞలపై ఇప్పుడు స్పందించాలి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్లో నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఒక ప్రొఫెసర్ పోస్టు ఉండాలి. కానీ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళా (చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం) వర్సిటీతో కలుపుకొని మొత్తం 12 వర్సిటీల్లో 70 శాతం బోధనా సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బంది పోస్టులు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేదు. తక్షణమే పారదర్శకంగా సంబంధిత ఖాళీలను భర్తీచేయాలి. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఇక, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పీహెచ్డీ, పీజీ కోర్సుల ఫీజుల పెంపు అదనపు భారంగా మారింది. ఈ పర్యటన సందర్భంగా పెండింగ్ నిధులు విడుదల చేసి పాలకులు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి. తాజాగా 28 ఏండ్లు దాటిన పీజీ విద్యార్థులకు హాస్టల్ అడ్మిషన్ నిరాకరిస్తున్నారు. అంటే సుదూర ప్రాంతాల బడుగు విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడమే కదా? విద్యాహక్కును హరించే ఈ నిబంధనను ఎత్తివేయాలి. 10 శాతం మంది పూర్వ పేద విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఇక్కడే తలదాచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ ‘అభయ హస్తం’ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నవిధంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని నిలబెట్టుకుంటే.. ఎక్స్ బోర్డర్ల సమస్యకు వేగంగా పరిష్కారం లభిస్తుంది.
తమది ‘ప్రజా పాలన’ అంటూ నిత్యం చెప్తున్న రేవంత్‌రెడ్డి.. ముందు వర్సిటీలో ప్రజాస్వామ్య వాతావరణం పరిఢవిల్లేలా చూడాలి. సీనియారిటీ, బోధనా అనుభవం ప్రామాణికంగా వీసీ, ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ జరుగుతుంది. సామాజికవర్గం (కులం) ప్రాతిపదికన జరగదనే విషయం రేవంత్ గుర్తెరగాలి. స్థానిక సమరానికి ముందే వర్సిటీకి వస్తున్నప్పటికీ.. విద్యాశాఖను కూడా తన వద్దే అంటిపెట్టుకున్న ముఖ్యమంత్రి ‘విద్యారంగం-అనుబంధ సమస్యల’పై మాట్లాడి, పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా వర్సిటీ అభివృద్ధికి రూ.1,000 కోట్ల నిధులు కేటాయించి, బ్లూ ప్రింట్ విడుదల చేయాలి. లేదు, వర్సిటీ పేరున పాలి‘ట్రిక్స్’ నడుపుతామంటే.. జాతీయోద్యమం, తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో పిడికిలి బిగించిన ఉస్మానియా విద్యార్థులు మరో మహోద్యమానికి శ్రీకారం చుడతారు. అప్పుడు ‘మార్పు’ అనివార్యం అవుతుంది.
– (వ్యాసకర్త: సోషియాలజీ స్టూడెంట్, ఓయూ)
నరేశ్ పాపట్ల 95054 75431