ఖైరతాబాద్, డిసెంబర్ 9 : నిమ్స్ దవాఖానలో దీర్ఘకాలికంగా పెండింగ్ సమస్యల కోసం నిమ్స్ నర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు సమాయత్తమవుతుండగా, వైద్యాధికారులు కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ్మెకు పోతే ఉద్యోగాలు ఊడుతాయంటూ బెదిరిస్తున్నట్లు కన్సాలిడేట్ నర్సింగ్ ఉద్యోగులను బెదిరిస్తున్నట్లు సిబ్బంది ఒకరు ఆవేదనతో తెలిపారు. నిమ్స్ యాజమాన్య పెద్దతో పాటు తరచూ ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ స్థాయి వైద్యాధికారి ఒకరు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరో వైపు తెర వెనుక నుంచి యాజమాన్య పెద్ద నిరసన విరమించుకోవాలని ఒత్తిడితో కూడిన రాయబారం కోసం దవాఖానలోని ఓ సీనియర్ అధికారిణిని రంగంలోకి దించినట్లు సమాచారం. కాగా ఏండ్ల తరబడి పెండింగ్ సమస్యలను ఎలాగైనా పరిష్కరించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న నర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది యూనియన్ వెన్నంటే ఉంటామని ఆ మధ్యవర్తితో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతుండగా, నేడు, రేపు గంట సేపు నిరసన దీక్షలు చేపడుతామని నర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు.