కన్నడనాట ప్రస్తుతం బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. కిస్సా కుర్సీకా అని వారం రోజుల వ్యవధిలోనే రెండు పర్యాయాలు వేడివేడిగా మసాలా దోశ తింటూ ముఖ్యమంత్రిగా ముందుకుసాగే విషయమై భేటీ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాన్నాళ్ల తర్వాత దక్షిణాదిలో మళ్లీ హస్తిన పిలుపు రాజకీయాలు కనిపిస్తున్నాయి. అటు కర్ణాటక ముఖ్యమంత్రి సీటులో తానే ఉంటానని సిద్ధరామయ్య అంటుండగా, కాదు తానే ఉండబోతున్నాని ఇటు డీకే శివకుమార్ తెగేసి చెప్తున్నారు. ఈ ఇద్దరి తగువు తీర్చేందుకు వరుస పిలుపులతో మరోపక్క కూర్చొని మాట్లాడుకోవాలి’ అని సెలవిస్తున్నది. దీంతో పాలనపై దృష్టిపెట్టడం మాట అటుంచి, కుర్చీని ఎట్లా కాపాడుకోవాలో తెలియక సతమతమయ్యే పరిస్థితి ఆ రాష్ట్ర వ్గనేతల మధ్య కనిపిస్తున్నదనే చర్చ జోరుగా
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు సైతం సీఎం సీటు కోసం యడియూరప్ప చేసిన విన్యాసాలను ఆ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కేవలం పాత్రలు మారాయే తప్ప; కథా, కథనం నడుస్తున్న తీరు మాత్రం అలాగే ఉన్నదనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో బలంగా ఉన్నది. కమలం నేతల వ్యవహారశైలితో విసిగిపోయిన ప్రజలు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. అయితే, వారి కంటే భిన్నంగా ఏమీ లేమనే సంకేతాలను వీరు తాజా పరిస్థితుల రూపంలో ప్రజల్లోకి పంపిస్తూనే ఉన్నారు. ఈ పరంపరలో కొనసాగుతున్నవే సిద్దు వర్సెస్ శివకుమార్ అల్పాహార రాజకీయాలని చెప్పకనే చెప్పవచ్చు.
కర్ణాటక రాష్ట్రంలో గతంలో, ఇప్పుడూ జాతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. అంతకుముందు జేడీఎస్ పవర్లో ఉన్నప్పుడు పాలన విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేది. కుమారస్వామి కుటుంబీకుల మధ్య పదవుల పంపకంలో గొడవలు వచ్చినప్పటికీ, అక్కడే ఉన్న దేవేగౌడ వాటిని సత్వరమే పరిష్కరించి పాలనను గాడిలో పడేశారు.
అంతేకాదు, ప్రాంతీయ పార్టీగా అక్కడి ప్రజల మనోభావాలను గుర్తెరిగి జేడీఎస్ పాలకులు నిర్ణయాలు తీసుకునేవారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికితోడు కర్ణాటక ప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేవారనే ప్రచారం సైతం ఉన్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఒక ప్రాంతీయ పార్టీగా జేడీఎస్ గౌరవించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే మద్దతు ప్రకటించిం ది. అధిష్ఠానం హస్తినలో లేదు కాబట్టే, వెంటనే నిర్ణ యం తీసుకోగలిగారనే అభిప్రాయం తెలంగాణ ప్రజ ల్లో అప్పట్లో కలిగింది. అంటే పార్టీపరంగా, ప్రభుత్వపరంగా ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అధిష్ఠానంపై ఆధారపడకుండా, వారి వంక చూడకుండా ధైర్యంగా ఓ అడుగు ముందుకేసే అవకాశం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉంటుంది.
ఒకవేళ ఆయా రాష్ర్టాల్లో జాతీయ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ పూర్తిస్థాయి మెజారిటీతో పాటు బలమైన నాయకత్వం తప్పక ఉండాలి. అట్లా ఉన్న సందర్భాల్లోనూ కొంతమంది నాయకులకు ఇబ్బందులు తప్పలేదు. ఉమ్మడి రాష్ట్రం లో జాతీయ పార్టీ నుంచి సీఎంలుగా పనిచేసిన పలువురు నేతల అనుభవాలు మన కండ్లముందే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ఆ తర్వా త కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు 59 సార్లు హస్తినకు వెళ్లారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడానికే వెళ్లినప్పటికీ, పనిలో పనిగా తమ అధిష్ఠానాన్ని కూడా కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేకపోలేదు. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అటు చూడక తప్పని పరిస్థితి నెలకొన్నదని ఆ పార్టీ నాయకులే బాహాటంగా చెప్తున్న సందర్భాలున్నాయి.
ఇదిలా ఉంటే సీఎం రేవంత్‌రెడ్డికి అధిష్ఠానం స్వేచ్ఛ ఇవ్వకపోవడం వల్లనే నిర్ణయాలు తీసుకునే విషయంలో తాత్సారం జరుగుతున్నదని చాలామంది అధికార పార్టీ నాయకులే అనుకుంటున్నారు. మరోవైపు సర్పంచ్ అభ్యర్థుల విషయంలో మంత్రుల వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో సంచలనం కలిగిస్తున్నది. ఫలితంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎం సైతం ఏమీ చేయలేకపోతున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్న ది. రాహుల్‌గాంధీ సహజంగానే జాతీయస్థాయి ఆలోచనలతో ప్రణాళికలు ఉండాలని భావిస్తారు. కానీ, రాష్ట్ర ప్రయోజనాలకు అవి విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి, కీలక నిర్ణయం తీసుకోవాలన్నా అటువైపు చూడాల్సి వస్తున్నది. రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక సీఎం ఎవరనే ప్రశ్న వచ్చిం ది. దానికీ అధిష్ఠానం దూతలు ఇక్కడికి రావాల్సి వచ్చింది. తదనంతరం హస్తినకు పిలిచి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి సొంతంగా మంత్రివర్గ విస్తరణ చేయడానికీ వీలులేని పరిస్థితుల్లో జాతీ య పార్టీలుంటాయి. పార్టీకి అధ్యక్షుడు ఉన్నప్పటికీ, మళ్లీ వీరిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిలు ఉండి అం తా తామై నడిపిస్తూ ఉంటారు.
గతంలో కేంద్రస్థాయిలోనే ఉండే సంకీర్ణ ప్రభుత్వాల హవా ప్రస్తుతం రాష్ర్టాలకు సైతం పాకింది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తున్నాయి. ఫలితంగా ఆయా రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గతంలో శివసేన, బీజేపీ పొత్తు ఉండేది. ఆ దోస్తానా ఫలితంగా ఇప్పుడు సేన పార్టీ రెండుగా చీలిపోయింది. అంతేకాదు, మునుపటి ప్రాభవాన్ని కోల్పోయింది. మరాఠాల పౌరుషం గురించి మాట్లాడిన పార్టీ శివసేన. అంతేకాకుండా మరాఠాల ఆత్మగౌరవం అం టూ దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి నానా తంటా లు పడుతున్నది. ఈ పార్టీ ఇటు కాంగ్రెస్, అటు బీజే పీ.. రెండు జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నది. అవసరమై కొన్నిసార్లు, అనివార్యమై మరికొన్ని మార్లు.. ఇలా ఎవరితో పొత్తు పెట్టుకున్నా మునుపటి ప్రభావం మాత్రం ఆ పార్టీకి ఇక వచ్చేలా లేదు. జాతీయ పార్టీలు అసెంబ్లీలలో కూడా పట్టు సాధించిన తర్వాత ప్రాంతీ య పార్టీలు మనుగడ సమస్యను ఎదుర్కొంటున్నా యి. మహారాష్ట్రకే చెందిన మరో పార్టీ ఎన్సీపీ ఆ రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు అది కూ డా చీలిపోయి ఇబ్బందులు పడుతున్నది.
ప్రాంతీయ పార్టీల నాయకత్వాలు బలంగా ఉన్న రాష్ర్టాల్లో అభివృద్ధి చాలా వేగంగా జరిగింది. ప్రాంతీ య పార్టీలకు తమ రాష్ట్రం గురించిన పట్టింపు ఎక్కువ గా ఉంటుంది. దానికి మంచి ఉదాహరణలు ఉత్తరాది న ఉన్నాయి, దక్షిణాదినా ఉన్నాయి. పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి నీతి ఆయోగ్ ఎన్నోమార్లు చెప్పింది. ధాన్యం దిగుబడి మొదలుకొని ఉద్యోగ, ఉపాధి కల్పన, సాగు, తాగునీ టి కల్పన వరకు దేశానికే మార్గదర్శమని తేల్చిచెప్పింది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ పాలన ఉండటం వల్లనే తొమ్మిదిన్నరేండ్లలో చారిత్రాత్మకమైన అభివృద్ధి సాధ్యమయ్యింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ అని జాతీయ పార్టీగా ప్రకటించినప్పటికీ జాతీయ స్థాయిలో ఎక్కడా ఆ పార్టీ పోటీ చేయలేదు.
ఉద్యమ నేతగా ఈ ప్రాంత అభివృద్ధికే కేసీఆర్ మొదటి ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలంగాణ ప్రజలకు తెలిసిందే. తెలంగాణను దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా చేయాలని భావించి అనేక సంస్కరణలు తీసుకువచ్చి, వాటిని అమలుచేసి, తద్వారా జీడీపీ వృద్ధిని సాధించి రాష్ర్టాన్ని అగ్రభాగాన కేసీఆర్ నిలబెట్టారు. ఈ సంగతిని అదే కేంద్ర ప్రభుత్వ సంస్థలు వెల్లడించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి.
ప్రాంతీయ పార్టీలు తమ ప్రాంతాన్ని ఆత్మగా భావిస్తాయి. కాబట్టి, ఇక్కడి ప్రజల జీవనస్థితిగతుల ఆధారంగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి చర్యలు తీసుకుంటూ, ప్రణాళికాబద్ధంగా, అభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగుతాయి. ప్రధానంగా ఈ కుర్చీలాట ప్రాంతీయ పార్టీలలో కొంత తక్కువనే చెప్పాలి.
ఫలితంగా అత్యధిక సమయం పరిపాలన, అధికార యంత్రాంగంపై పట్టు సాధిస్తారు కాబట్టి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. దీంతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద అజమాయిషీ సహజంగానే ప్రాంతీ య పార్టీ నేతలకు ఉంటుంది. ఫలితంగా ఇతర శాసనసభ్యుల నుంచి వారి కుర్చీకి వచ్చే ప్రమాదమేమీ ఉం డదు. కాబట్టి ఆ దిశగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కేవలం కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వచ్చినప్పుడు మాత్రం ఈ కుర్చీలాట వారికి సైతం మినహాయింపు కాదు. సీల్డ్ కవర్ రాజకీయాలు గాని, ప్రతి చిన్న విషయానికి ఆమోదం తెలిపేదాకా వేచి చూసే సందర్భాలు గాని ఈ పార్టీలకు అవసరం ఉండ దు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే ఆయా రాష్ర్టాల అభివృద్ధిలో గణనీయమైన మార్పులు వచ్చాయి, వస్తున్నాయి.
తమిళనాడును తీసుకుంటే ఇప్పటివరకు జాతీయ పార్టీలను అక్కడి ప్రజలు విశ్వాసంలోకి తీసుకోలేదు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మాత్రమే అధికారాన్ని బదిలీ చేసుకుంటూ పాలన సాగించిన తీరును మనం చూశాం. కానీ, రానున్న ఎన్నికల్లో అక్కడ కూడా జాతీయ పార్టీలతో ఆయా పార్టీల పొత్తు అనివార్యంగా కనిపిస్తున్నది. అంతెందుకు తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరుతో పుట్టిన తెలుగుదేశం పార్టీ సైతం ఎన్టీ రామారావు అనంతరం చంద్రబాబు పగ్గాలు చేపట్టాక పలు పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీచేసిన సందర్భాలే ఎక్కువ. ప్రస్తుతం ఏపీలో ఒక జాతీయ పార్టీతో పాటు మరో ప్రాంతీయ పార్టీ జతకట్టి ఎన్డీయే కూటమిగా పాలన సాగిస్తున్న తీరును మనం చూస్తున్నాం. ఇలా అనేక రాష్ర్టాల్లో సంకీర్ణ శకం ప్రారంభమైన నేపథ్యంలో భవిష్యత్తులో రాష్ర్టాల్లో పాలన ఒకరి చేతుల్లో ఉండ టం, అది కూడా ప్రాంతీయ పార్టీ చేతుల్లో అసలు ఉం టుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ప్రజలు కూడా ప్రాంతీయ పార్టీలైతే తమ రాష్ట్రం గురించి, దాని అభివృద్ధి గురించి మరింత ఎక్కువగా ఆలోచిస్తాయనే సోయిని మరిచి పథకాల మాయలో పడి మార్పు పేరు తో ఇతర పార్టీలను కోరుకుంటున్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన ఆ జాతీయ పార్టీలు అధిష్ఠానంపై ఆధారపడాల్సి వస్తున్నది. నిర్ణయాల కోసం వేచిచూడాల్సిన అనివార్య స్థితి వారిది. కన్నడనాటనే కాదు, తాజాగా ఈ మధ్యన జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒకవేళ కాం గ్రెస్ అభ్యర్థి ఓడిపోతే ఇక్కడ కూడా ముఖ్యమంత్రి మారుతారన్న ప్రచారాన్ని ఆ పార్టీలోని కొందరు నాయకులు చేయడం అలాంటి పార్టీల వాస్తవ స్థితికి దర్పణం పడుతున్నది.
తుమ్మితే ఊడిపోయే ముక్కులా ముఖ్యమంత్రి సీటును చూడటం, దాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసే క్రమంలో అభివృద్ధికి ద్వితీయ స్థానం ఇవ్వక తప్పదనే విషయం తేటతెల్లం అవుతున్నది. ఇలాంటి పరిణామాలను ఆసక్తిగా చూసే ప్రజలు జాతీయ పార్టీల పాలన బాగుంటుందో, ప్రాంతీయ పార్టీల పాలన బాగుంటుందో బేరీజు వేసుకుని, ఎవరు అధికారంలో ఉంటే తమ జీవితాలు బాగుపడతాయో వారికే అధికార పీఠాన్ని అప్పజెబితే తప్ప ఇలాంటి కుర్చీలాటలకు బ్రేక్ పడదు.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
ఆస్కాని మారుతి సాగర్ 901017 56666