కార్పొరేట్లకే కేంద్ర ఇంధనం2025, ఆగస్టులో కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వు జారీచేసింది. వాస్తవానికి థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు కాలుష్యాన్ని ఆయా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కాలుష్యాన్ని తగ్గించడానికి ఎఫ్‌జీడీ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్లను నెలకొల్పుతారు. అయితే, కాలుష్యాన్ని నివారించే ఎఫ్‌జీడీ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్ల ఏర్పాటు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో జారీచేసిన ఉత్తర్వుల్లో మినహాయింపును కల్పించింది. దీనిద్వారా దేశంలోని డిస్కంలకు రూ.5,34,813 కోట్లు ఆదా అవుతాయని సదరు ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొన్నది.
రాజ్‌కుమార్ సింగ్.. 1975 బ్యాచ్ ఇండియన్ సర్వీసెస్ మాజీ అధికారి. ఆయన ఎన్డీయే ప్రభుత్వంలో సుదీర్ఘకాలం ఇంధన శాఖామంత్రిగా పనిచేశారు. బీహార్‌లోని ఎన్డీఏ ప్రభుత్వం అదానీ పవర్ లిమిటెడ్‌తో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందం వల్ల ఆ రాష్ట్ర ఖజానాకు రూ.62 వేల కోట్ల నష్టం వాటిల్లనున్నదని సొంత పార్టీపైనే ఆయన ఆరోపణలు చేశారు. అంతే, ఆయనను బీజేపీ నుంచి ఆరేండ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు గత నవంబర్ 15వ తేదీన ఓ ప్రధాన పత్రికలో వార్త అచ్చయింది.
అయితే, బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో రూ.30 వేల కోట్ల పెట్టుబడితో 2,400 మెగావాట్లు, మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో 1,600 మెగావాట్లు, రాజస్థాన్‌లోని కవాయ్ ప్రాంతంలో 1,600 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్, కోర్బాల్లో 2,920 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ కేంద్రాలను అదానీ పవర్ లిమిటెడ్ రాబోయే మూడు నుంచి ఐదేండ్లలో నెలకొల్పనున్నట్టు సమాచారం. మొత్తమ్మీద అదానీ పవర్ 2031-32 వరకు దేశవ్యాప్తంగా 42 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్ల ను నిర్మించనున్నది.
పై మూడు విషయాలు వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ, వీటి వెనుక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా, కొన్ని ప్రైవేట్ శక్తులకు లాభం చేకూర్చేవిగా గోచరిస్తున్నాయి. అదానీ పవ ర్ లిమిటెడ్ భాగల్పూర్లోని పైరిపంటి వద్ద 800X3= 2,400 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పుతున్నది. అందుకుగాను అక్కడి ప్రభుత్వం 1,050 ఎకరాల భూమిని ఒక్క రూపాయి నామమాత్రపు లీజు ధరకు అదానీ కంపెనీకి కట్టబెట్టారు. ఇదే అం శం ఆ రాష్ట్ర రాజకీయ సభల్లో చాలాచోట్ల ప్రస్తావనకు వచ్చింది. అంతేకాకుండా రూ.35,100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ కేంద్రం ఉత్పత్తి చేసే విద్యుత్తును రాబోయే 25 ఏండ్లకు గాను బీహార్ ప్రభుత్వరంగ సంస్థలు కొనుగో లు చేస్తాయి. యూనిట్ ధర రూ.6.075గా అదానీతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ జరిగింది. అధిక ధరతో కొనుగోలు చేసే ఈ విద్యుత్తు వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 25 ఏండ్లలో రూ.62 వేల కోట్ల నష్టం జరుగుతుందని మాజీ కేంద్ర మం త్రి రాజ్‌కుమార్ సింగ్ ఆరోపణ చేశారు. అందుకు గాను కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన బహుమానం ఆరేండ్ల పార్టీ బహిష్కరణ.
ఇప్పటికే నిర్మాణం పూర్తికావచ్చిన థర్మల్ విద్యుత్ కేంద్రా లు, ఉత్పత్తి చేస్తున్న కేంద్రాలతో సహా నిర్మాణంలో ఉన్న యూనిట్లు కూడా తప్పనిసరిగా ఎఫ్‌జీడీ పరికరాలు ఫ్లూ గ్యాసెస్ డీసల్ఫరైజేషన్ పరికరాలు తప్పనిసరిగా బిగించవల సి ఉంటుందని కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ ఆదేశాలున్నా యి. వీటిని ఏర్పాటు చేసుకోవడానికి మెగావాట్‌కు రూ.కోటి నుంచి రూ.కోటి ఇరవై లక్షలు ఖర్చవుతుంది. ఇందులో భాగంగా 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాం ట్, కేటీపీఎస్ ఏడో దశ ప్లాంట్, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లకు ఎఫ్‌జీడీ యూనిట్లను బిగించడానికి అవసరమైన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వైటీపీఎస్లోనే సుమారు రూ.5 వేల కోట్లు వెచ్చించడం జరుగుతున్నది. విద్యుత్తు కేం ద్రాల నుంచి వెలువడే సల్ఫర్ డై ఆక్సైడ్ పరిమాణం దేశవ్యాప్తంగా చూసినప్పుడు నిబంధనలకు లోబడే ఉన్నాయని, గాలిలో వాటి పరిమాణం జాతీయ ప్రమాణాలు అయినటువంటి 80 మైక్రో గ్రాములు/ క్యూబిక్ మీటర్ కంటే తక్కువగానే ఉన్నందున ఎఫ్‌జీడీ పరికరాలను పెట్టాల్సిన అవస రం లేదని కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో జారీచేసిన ఉత్తర్వులో పేర్కొన్నది.
ఇదే ఉత్తర్వులో వేరియబుల్ టారిఫ్ చెల్లించకపోవడం వల్ల రూ.2,09,355 కోట్లు, మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లించకపోవడం వల్ల రూ.2,06,085 కోట్లు వెరసి ఎఫ్‌జీడీ ప్రాజెక్టును స్క్రాప్ చేయడం ద్వారా రూ.4,15,440 కోట్లు ఆదా అవుతాయని కేంద్రం పేర్కొన్నది. ఎఫ్‌జీడీ ప్రాజెక్టులను బిగించకుండా ఉండటం వల్ల రూ.1,19,373 కోట్లు ఈ రకంగా మొత్తమ్మీద రూ.5,34,813 కోట్లు డిస్కంలకు ఆదా అవుతాయని చెప్పుకొచ్చింది.
గత దశాబ్దకాలంగా ఎంపిక చేయబడిన కొంతమంది ప్రైవేటు పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం కూడా వివాదాస్పదంగా కనిపిస్తున్నది. ఈ నిర్ణయాన్ని ముందుగానే తీసుకున్నట్టయితే ప్రాజెక్టు విలువ మెగావాట్‌కు రూ.కోటి తగ్గడమే కాకుండా రూ.లక్షల కోట్లు ప్రజాధనం వృథా అయ్యేది కాద ని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదట ఎఫ్‌జీడీ యూనిట్లను విధిగా బిగించాలని నిబంధనలు విధించి, అనంతర కాలంలో మినహాయింపులు ఇవ్వడం వల్ల జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి. కాలుష్య పరిమాణం పరిమితులకు లోబడి ఉన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి ముందుగా తెలియదనుకోవాలా? ఇప్పుడు ఆదా అవుతుందని చెప్తున్న రూ.లక్షల కోట్లు వాస్తవంగా నష్టం జరిగినట్లు కాదా? ఏదేమైనా వ్యక్తుల స్వలాభం కోసం వ్యవస్థలు పనిచేయడమే ప్రస్తుతం కొనసాగుతున్న అతిపెద్ద విషాదం.
– (వ్యాసకర్త: విద్యుత్‌రంగ విశ్లేషకులు)
తుల్జారాంసింగ్ ఠాకూర్