నాగర్ కర్నూల్ : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టులను (Irrigation Projects ) పూర్తి చేయకపోతే ప్రాజెక్టు ప్రాంతాల వద్ద పోరాటం చేస్తానని మాజీ మంత్రి డా. నాగం జనార్దన్ రెడ్డి ( Nagam Janardhan Reddy ) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతుల పట్ల అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెండింగ్లో ఉన్న 3½ కిలోమీటర్ల పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు తాగునీరు, సాగునీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే వయస్సును లెక్కచేయకుండా పోరాటాలు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
ప్రాజెక్టు పనులు పూర్తి చేయించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో విద్యుత్ సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ఎత్తిపోతల పథకంలో ఐదు మోటర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని , రైతులు పండించిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం కాదు, రైతుల సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని స్పష్టం
చేశారు. ఈ సమావేశంలో నాయకులు రవి, పాండు, లక్ష్మయ్య, అర్జునయ్య, బాల గౌడ్, వెంకటేష్, సత్యం, అహ్మద్, భీమయ్య, భీముడు, విష్ణు చారి పాల్గొన్నారు .