తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా పత్రికలకు ఇచ్చిన మొదటి పేజీ ప్రకటనలో ‘తెలంగాణ మీన్స్ బిజినెస్’ అనే కొత్త మాటను ప్రభుత్వం ప్రచారానికి తెచ్చింది. ఇదేదో మార్వాడీ స్లోగన్‌లా ఉన్నది. గుజరాత్, రాజస్థాన్ మాదిరి తెలంగాణ వ్యాపార సామాజికవర్గాల రాష్ట్రం కాదు. ఆహారధాన్యాల దిగుబడిలో ముందున్న నేల ఇది. అన్నపూర్ణగా పేరు పొందింది. గత పదేండ్ల పాలనలో సాగునీటి సమస్యలు తీరి వ్యవసాయిక రాష్ట్రంగా దేశంలో అగ్రగామిగా నిలుస్తున్నది. సస్య, క్షీర విప్లవాల్లో ముందుండి కోళ్లు, గొర్రెల పెంపకం ద్వారా గ్రామీణ ఆదాయాన్ని పెంచుకుంటున్నది. తెలంగాణ మీన్స్ కల్చర్ అండ్ అగ్రికల్చర్, నాట్ బిజినెస్.
గ్లోబల్ సమ్మిట్ సంబురాలు అందరివీ కావు. అవి కేవలం పారిశ్రామికవేత్తలవి, సర్కారు పెద్దలవి. పేదలు అడుగుపెట్టలేని గొప్పవారి పెళ్లి సందడిలా ఆ ప్రాంగణం మెరిసిపోతున్నది. సమ్మిట్ పేరిట రేవంత్‌రెడ్డి చేస్తున్న హంగామా చూస్తుంటే హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని ఎప్పుడు కలవరించే చంద్రబాబు గుర్తుకువస్తున్నారు. అప్పుడు ఆయన విస్మరించిన రంగాలనే నేడు రేవంత్ కూడా పట్టించుకోవడం లేదు. ఓట్ల కోసం గ్రామీణులను నమ్మించి, ఆసరా పింఛన్‌దారులను వంచించి, యువతను మభ్యపెట్టి పాలనను కైవసం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు అడుగుల్లో అడుగులు వేస్తూ ప్రైవేటు పారిశ్రామిక రంగానికి రాష్ట్ర వనరులను దోచిపెడుతున్నారు.
లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర ప్రజలకు దక్కేదేమిటో స్పష్టత ఇవ్వాలి. తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమే కాదు, ఆదిలాబాద్ మారుమూల గిరిజనుడి నుంచి పాలమూరు కూలీ దాకా ప్రభుత్వ నిర్ణయాల ఫలితాలు దక్కాలి. చరిత్ర చదవడం వేస్ట్ అన్న చంద్రబాబు ఇంజినీరింగ్ కాలేజీలు పెంచి సర్కారు ఉద్యోగాలకు ఎగనామం పెట్టారు. అభివృద్ధికి చిరునామాగా తనను తాను ప్రచారం చేసుకున్న చంద్రబాబును భరించలేక నా డు ప్రజలు పక్కనపెట్టారు. సామాన్యుల బాగోగుల ను పట్టించుకోని ప్రభుత్వాలు కలకాలం నిలువవు.
పరిశ్రమల స్థాపన సర్వరోగ నివారిణి కాదు. పౌరుల జీవనోపాధికి, దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నట్టు కనబడినా లాభాల్లో అధికభాగం యాజమాన్యం ఖాతాలోకే వెళ్తుంది. శ్రమదోపిడీకి ఆలవాలమైన పరిశ్రమల కోసం విశాలమైన స్థలం, నీరు, విద్యుత్తు, ముడిసరుకు లు, మానవ వనరులు కావాలి. స్థలం కోసం ఎకరాల కొద్దీ సాగుభూమి కావాలి. నీటి అవసరం తీరేందుకు నిండు చెరువులు కావాలి. ముడిసరుకు కోసం భూగర్భాన్ని ఛేదించాలి. ఇచ్చిన వేతనంతో కూలీలు సంతృప్తిపడాలి.
పైవన్నీ పరిశ్రమకు కనీస అవసరాలు. వాటివల్ల మరోవైపు యంత్రాల చప్పుళ్లు, అవి వదిలే కాలుష్య వాయువులు, సరుకు రవాణా వాహనాల సందడితో నింగీ నేల నిండిపోతుంది. ఏ దేశంలోనైనా పారిశ్రామిక అభివృద్ధి అంటే ఇదే. పరిశ్రమలు స్థాపించేది ప్రైవేటురంగం కాబట్టి ఉద్యోగులు, కూలీల ప్రయోజనాల కన్నా సొంత లాభాలపైనే వాటికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వాలు, అధికారవర్గం అన్నీ ఆ యాజమాన్యాలకు అనుకూలంగానే పనిచేస్తాయి.
కార్మిక శ్రమ దోపిడీని ఎవరు లెక్కలోకి తీసుకోరు. మొదట్లో పరిశ్రమలు వద్దని పోరాడినవారు కూడా రాజీపడిపోయి వాటిలోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ బతుకుతారు. కొంత కాలానికి కార్మికులు కూడా జీవం లేనట్టు యంత్రాల మాదిరే కాలం గడుపుతుంటారు. అదే జీవితాలకు అలవాటు పడిపోతారు. మార్పును వింతగా గమనిస్తున్న పెద్ద వయసువారు పాత కాలాన్ని నెమరువేసుకుంటూ నిట్టూరుస్తుంటారు.
చేతి వృత్తులు, వ్యవసాయంతో పచ్చగా ఉన్న పల్లెల్లో పరిశ్రమ స్థాపనకు ప్రజలెవరూ ససేమిరా ఒప్పుకోరు. దానివల్ల జరిగే ఆరోగ్య, వాతావరణ విధ్వంసం గురించి తెలుసుకొని నిరసనలు చేపడుతారు. అనుమతినిచ్చిన ప్రభుత్వాలు ప్రజాభిప్రాయాన్ని వినీ విననట్టు ఉండిపోతాయి. క్రమంగా వద్దే వద్దన్న వారి సంఖ్య, గొంతు తగ్గిపోయి పరిశ్రమలకు పునాదులు పడుతాయి.
భూమ్మీద ఎక్కడ ఏ పరిశ్రమ కనబడ్డా వాటి అడుగున వద్దన్నవారి నిరసనలు తొక్కి ఉంటాయి. ‘మా ఊరు, మేము లోకల్, మా మాటే చెల్లుబాటు కావాలి, చట్టంలో మరోలా ఉన్నది’ అని గొంతు చించుకున్నా పరిశ్రమలను ఎవరూ ఆపలేరు. ఊరు, ప్రాంతం పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోతాయి. పెత్తనం వారిదే సాగుతుంది. వారి నిర్ణయాలను వ్యతిరేకించినవారికి ఇబ్బందులు సృష్టిస్తారు. ఊర్లోని కొందరిని తమ తొత్తులుగా మార్చుకొని అంతా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటారు. అవసరమైతే ఊరి పేరు కూడా పరిశ్రమల యజమానుల తండ్రి, తాతలనగర్గా మారిపోతుంది.
ఇలా పారిశ్రామిక అభివృద్ధిలో ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి. మనుషుల జీవితాలు, ఆలోచనాసరళిలో ఆ ప్రభావం ఉంటుంది. వయోవృద్ధులు వెళ్లిపోతారు. మధ్య వయస్కులు మంచి రోజులను గుర్తుచేసుకుంటూ చింతిస్తుంటారు. యువకులు సెల్ఫోన్లు పట్టుకొని, బైకులపై తిరుగుతూ ఇదే లోకం అనుకుంటారు. అయితే, కాలం అట్లే కొనసాగుతుందనుకుంటే ఈ మధ్య టెక్నాలజీ భూతం వచ్చి అంతా తారుమారు చేసింది. కొత్త రకం యంత్రాల రాకతో మనుషుల అవసరం తగ్గిపోతున్నది. ఉపాధి లేక యువత ఊరు మారుతున్నారు. నగర విస్తరణలో భాగంగా చదువు వచ్చినవాడు, రానివాడు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లా బతుకులీడుస్తున్నారు. పరిశ్రమల లాభాలను, ప్రభుత్వ ఆదాయాన్ని లెక్కలేస్తూ అద్భుత ప్రగతి సాధించామంటూ ప్రభుత్వాలు చంకలు గుద్దుకుంటాయి. కుంగిపోయిన బతుకులు కాకుండా ఎత్తయిన కట్టడాలు అభివృద్ధికి చిహ్నాలుగా కనబడుతాయి. సామాన్యుడు నిన్నటి కన్నా అధ్వాన్నంగా బతుకుతున్నాడు. పరిశ్రమల పెరుగుదల వల్ల పని దొరికినా శ్రమ దోపిడీ ఎక్కువ. కఠిన నిబంధనలు, చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతాయి.
పరిశ్రమల వద్దకు వివిధ ప్రాంతాల ప్రజల వలస సాగుతుంది. అలా వచ్చినవారు ఇక తమ బతుకంతా ఇక్కడే అని భావిస్తారు. సంఖ్యను బట్టి బయటివారు కూడా పెత్తనం చెలాయించడం మొదలవుతుంది. చివరికి అంతా కలగాపులగం అయిపోతుంది. స్థానికులు తమ నేలపై తామే పరాయివారై పోతారు. అభివృద్ధిలో పరిశ్రమల స్థాపన ఒక పార్శమే. అడవి, వ్యవసాయం, చేతివృత్తులు, కళలు, సంస్కృతి అన్నీ పచ్చగా ఉంటేనే సమగ్రాభివృద్ధి.
– బద్రి నర్సన్