అధికారానికి దూరమై అలమటిస్తున్న కాంగ్రెస్ ఎలాగోలా గెలిచేందుకు అడ్డగోలుగా హామీలిచ్చింది. అరచేతిలో స్వర్గం చూపెట్టి అమాంతంగా ముంచింది. ఒకటా రెండా, 420 హామీలు ఇచ్చింది. అన్నివర్గాలకు అన్నీ అని ఆశలు పెట్టింది. అందులో ఆరు గ్యారెంటీలు అని ఊరించింది. అయినా జనం నమ్మరేమోనని ప్రామిసరీ నోట్లు రాసిచ్చింది. అవీ సరిపోవేమోనని దేవుళ్లపై ఒట్లు పెట్టింది. వాలులో కొట్టుకుపోతున్నవాడు ఏ గడ్డిపరక దొరికినా పట్టుకున్నట్టు కనిపించిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఇస్తానని మాటిచ్చింది. నడమంత్రపు నాయకత్వాన్ని ముందుపెట్టుకొని నయవంచనకు తెగించింది. వేలం పాట తరహాలో కేసీఆర్ సర్కారు ఇచ్చిందానికన్నా ఎక్కువే ఇస్తానని బులిపించింది. ఓటరు ఏమరుపాటున నమ్మి గెలిపిస్తే ఒట్టు తీసి గట్టున పెట్టింది కాంగ్రెస్.
ఈ రెండేండ్ల పాలనలో చేసిందేమైనా ఉందంటే మాట తప్పడం, మడమ తిప్పడం మాత్రమే. చేతగాని, చేవలేని పాలనలో అభివృద్ధి అడుగంటింది. సంక్షేమం సడుగులిరిగింది. యువత మొదలు రైతుల దాకా అందరికీ కాంగ్రెస్ మార్కు చెయ్యివ్వడం అంటే ఏమిటో మరోసారి తెలిసివచ్చింది. ఈ పరిస్థితుల్లో సహజంగానే కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. దారితప్పి వెళ్తే ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. బూటకపు హామీలపై నిలదీస్తున్నారు.
ఎందుకంటే, పింఛన్లు పెంచలేదు. రైతుభరోసా రాల్చలేదు. ఉద్యోగాలు విదిల్చలేదు. ఉన్న కల్యాణలక్ష్మి ఊడిపోయింది. పాలన పడకేసిం ది. రాష్ట్రం దివాళా అంచుకు చేరుకున్నది. ఫలితంగా ప్రజలు రెండేండ్ల పాలనపై మండిపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల బాగోతంపై పిడికిళ్లు బిగిస్తున్నారు. గ్రామాలు మర్లవడుతున్నాయి. చీరల పంపిణీపై మాట మీద మాట తప్పినందుకు చీదరిస్తున్నారు. ఇండ్ల బిల్లులపై పండ్లు కొరుకుతున్నారు. రుణమాఫీలో దారుణ మోసాన్ని కడిగేస్తున్నారు.
ఆడబిడ్డలకు ఇస్తానన్న బంగారం ఎక్కడని గల్లా పడుతున్నారు, తరిమికొడుతున్నారు. ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఊరూరి దృశ్యమైపోయింది. సమాధానాలు చెప్పలేక కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎందుకొచ్చిన పల్లెపోరని తలపట్టుకుంటున్నారు. ఒకరిద్దరు నేతలైతే ప్రజల్లో తిరగడం కష్టమైపోయిందని బహిరంగంగానే వాపోతున్నారు. మరికొందరు అసభ్యమైన భాషలో ప్రజల మీద అరుస్తున్నారు. అందలమెక్కిన అగ్రనేతలు ఊరేగుతుంటే కిందిస్థాయి నేతలు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక బకరాలైతున్నారు.
ప్రజలు నిలదీయడంతోనే సరిపెట్టుకుంటే ఏమీ జరగదు. తరిమికొడితే ఒరిగేదేమీ లేదు. మార్పు మార్పు అంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చినవారికి అసలైన మార్పు అంటే ఏమిటో చూపించాలి. మోసం చేయడం కాంగ్రెసిజం.. మాటతప్పడం ఆ పార్టీ నైజం. తిట్లతో, ఒట్లతో గద్దెనెక్కి తెలంగాణలో చేసి చూపించింది అదే. ప్రజాపాలన పేరు.. ప్రజావంచన తీరు. సొంతలాభం తప్ప ప్రజాహితం పట్టని వృద్ధ పార్టీకి మాటలు చాలవు, ఓటుతోనే తరిమికొట్టాలి. కల్లబొల్లి మాటల కాంగ్రెస్కు కర్రుకాల్చి వాతపెట్టాలి. ఎగవేతల కాంగ్రెస్ను ఏడునిలువుల లోతులో పాతరేయాలి. బూటకపు మాటలతో ఓటుకు కాటువేసిన నేతలకు ఆ ఓటుతోనే గుర్తుండిపోయేలా గుణపాఠం నేర్పించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన మోసానికి గ్రామీణ ఎన్నికల్లో అసలుతో సహా వసూలు చేయాలి.