Illegal Constructions | పోచారం, మే 25 : పోచారం మున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాలలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతుంది. కింది స్థాయి సిబ్బంది చేతివాటం, అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా అక్రమ నిర్మాణదారులు స్పీడు పెంచారు. కొంత మంది నిర్మాణ దారులు మున్సిపాలిటీ నుంచి భవణాల నిర్మాణం కోసం జీ ప్లస్2 పర్మిషన్ తీసుకొని ఐదు నుంచి ఆరు అంతస్తుల వరకు నిర్మాణాలు జరుపుతున్నారు.
మరికొంత మంది నిర్మాణ దారులు అప్పట్లో ఉన్న ప్రజా ప్రతినిధుల కనుసన్నుల్లో ఉండి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలను చేపడుతున్నారు. దీంతో మున్సిపాలిటీకి చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపాలిటీ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్ధమవుతుందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని ఇన్పోసెస్ ప్రాంతంలో, అన్నోజిగూడ, చౌదరిగూడ, నారపల్లి, పోచారం, ఇస్మాయిల్ఖాన్గూడ, యంనంపేట్ వెంకటాపురం, కాచివానిసింగారం, జోడిమెట్ల, వరంగల్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఈ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.
అక్రమ నిర్మాణాల కారణంగా భవిష్యత్లో మౌలిక వసతుల కల్పనలో మున్సిపాలిటీకి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉన్నా అధికారులు ఎందుకు ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పోచారం మున్సిపాలిటీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణలపై చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.