Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర నీటి అవసరాలు కాపాడటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది.. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీ తరలించుకుపోయే కుట్ర జరుగుతుంది. తెలంగాణకు ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు. గోదావరి – బనకచర్లకు ఒక్క అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తుంది. కేంద్రం జుట్టు తన చేతిలో ఉందని చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జలదోపిడీ.. కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు చంద్రబాబు మోకాలు అడ్డుపెట్టారు. తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయాలని కేంద్రానికి లేఖలు రాశారు. తెలంగాణ ప్రాజెక్టులు నిలిపివేయాలని ఏపీకి 20కి పైగా లేఖలు రాసింది. పాలమూరు, భక్తరామదాసు, డిండిపై చంద్రబాబు లేఖలు రాశారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వట్లేదని సీఎం అసెంబ్లీలోనే చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరిస్తామని రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. నిన్న అందరి కంటే ముందే వెళ్లి సమావేశంలో కూర్చున్నారు. ఏ అనుమతులు లేని గోదావరి – బనకచర్లను ఎందుకు అడ్డుకోవట్లేదు. నీతి ఆయోగ్ సమావేశంలో రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు. అక్రమంగా నీళ్లు తీసుకెళ్తుంటే ఆపే ప్రయత్నం చేయడం లేదు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు బాధ్యత లేదా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తుంది. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతు ఇవ్వరు. ఏపీ ప్రాజెక్టులకు అనుమతులు లేకున్నా నిధుల కనవవర్షం కురిపిస్తున్నారు. ఇదెక్కడి నీతి..? కిషన్ రెడ్డి చొరవచూపాలి. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. అక్రమ ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తాం. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతిని ఎండగడుతాం అని హరీశ్‌రావు హెచ్చరించారు.
మరో విషయంలో తెలంగాణకు బీజేపీ ద్రోహం చేస్తుంది. పోలవరం ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్లించినట్లు అయితే ఆ 80 టీఎంసీలు ఎగువన ఉన్న రాష్ట్రాలకు చెందుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. ఇందులో సుప్రీం కూడా తల దూర్చదు. తెలంగాణకు 45 టీఎంసీలు, కర్ణాటకుకు 25, మహారాష్ట్రకు 14 టీఎంసీలు అని చెప్పింది. సీడబ్ల్యూసీకి కర్ణాటక దరఖాస్తు చేసింది.. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయించింది. మహారాష్ట్రకు చెందిన 14 టీఎంసీలు ఇచ్చింది. అదే పద్ధతుల్లో 45 టీఎంసీలు మాకు దక్కాలని, పాలమూరు ఎత్తిపోతలకు కేటాయించండి అంటే డీపీఆర్ వాసప్ పంపుతారు. ఇది బీజేపీకి తెలంగాణ పట్ల ఉన్న వివక్షకు నిదర్శనం. ఇంత దుర్మార్గంగా ఎట్ల వ్యవహరిస్తారు. అదే బచావత్ ఇంకో మాట చెప్పింది. 90 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకుపోయినా.. ఇదే నిష్పత్తిలో ఎగువన ఉన్న రాష్ట్రాలకు కృష్ణా నదిలో నీటి వాటాలు కేటాయించాలని చెప్పింది. ఈ లెక్కన తెలంగాణకు 112 టీఎంసీలు రావాలి. అంటే మొత్తం 157 టీఎంసీలు తెలంగాణకు కలిపి ఇవ్వాలి. దీంతో కల్వకుర్తి, డిండికి నికర జలాలు కేటాయించుకోవచ్చు అని హరీశ్‌రావు తెలిపారు.