భీమదేవరపల్లి : సభ్యుల పరస్పర సహకారంతోనే ఆర్థికాభివృద్ధి (Economic development ) సాధిస్తామని ముల్కనూరు పురుషుల పొదుపు సమితి-2 ( Mens Savings Society ) అధ్యక్షులు నరాల తిరుపతిరెడ్డి (Narala Tirupati Reddy) అన్నారు. ఆదివారం ముల్కనూరులోని స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో ముల్కనూరు పురుషుల పొదుపు సంఘం-4 ఆరవ వార్షిక మహాసభ జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు బొజ్జపురి మురళీకృష్ణ సభ్యులకు వార్షిక నివేదికను చదివి వినిపించారు.
అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన సమితి-2 అధ్యక్షులు నరాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ పొదుపులపై వచ్చే ఆదాయాన్ని వృథా ఖర్చులకు వెచ్చించకుండా మరింత పొదుపు చేసుకుంటే కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని అన్నారు. సభ్యులు ప్రతి రూపాయిని పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తు కాలంలో వినియోగించుకోవచ్చని వివరించారు. సంఘంలో రూ. కోటి 9లక్షల 48వేలు నిధులు ఉండగా ఈ ఏడాది బోనస్ రూపేణ రూ. 6 లక్షల 80వేలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
సభ్యుల దహన ఖర్చులు రూ. 3, 500 నుంచి 4500 కు పెంచుతున్నట్లు సభలో తీర్మానం చేశారు. సంఘంలో మొత్తం 12 డైరెక్టర్ స్థానాలుండగా నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ స్థానాల్లో పోటీచేసిన మురళీకృష్ణ, పుల్ల రాంకుమార్, వంగ సదానందం, గొల్లెన కుమారస్వామి డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షుని ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.
అధ్యక్షులుగా ఏడవసారి బొజ్జపురి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులుగా గుడి కందుల కిషోర్ ఐదవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘ పాలకవర్గ సభ్యులు ఎల్తూరి ప్రభాకర్, కొండా వెంకటేశ్వర్లు, అప్పని బిక్షపతి, సాదిక్ పాషా, రాపెల్లి సదానందం, పుల్ల రాం కుమార్, గొల్లెన కుమార స్వామి, పంగరెక్క విజయ్ గాంధీ, వంగ సదానందం, గొల్లపల్లి శేఖర్, సంఘ గణకులు రాపెల్లి రాజు, మంగ లక్ష్మణ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.