కారేపల్లి, నవంబర్ 20 : మహిళలకు బతుకమ్మ చీరలే కాదు, వారికిచ్చిన రూ.2,500 హామీని అమలు చేయాలని ఐద్వా వైరా డివిజన్ అధ్యక్షురాలు కొండబోయిన ఉమావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సురపాక ధనమ్మ అధ్యక్షతన కారేపల్లిలో జరిగిన ఐద్వా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలును ప్రభుత్వం మరిచిందన్నారు. మహిళలను లక్షాధికారులు చేసే మహాలక్ష్మి పథకం అమలుకు నోచుకోలేదని, అమలు చేస్తున్న ఉచిత బస్ ప్రయాణం పల్లెవాసులకు అందడం లేదన్నారు. బస్సుల సంఖ్య తగ్గించడంతో ప్రయాణం కష్టతరంగా మారిందన్నారు. కారేపల్లి మండలంలో ఖమ్మం-గాదెపాడు, ఖమ్మం- చీమలపాడు బస్సులను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
ఉచిత ప్రయాణం నుండి తప్పించుకోవటానికే ఆర్టీసీ బస్ల రద్దు చేపట్టారన్నారు. బస్సుల రద్దుతో ప్రయాణికులతో పాటు విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు స్పందించి రద్దు చేసిన ఆర్టీసీ బస్సులను పునరుద్దించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సీతమ్మ, కరపటి రాంబాయమ్మ, ఐద్వా నాయకురాలు మేకల స్వరూప, పోతర్ల సునీత, చల్ల మల్లమ్మ, అజ్మీర జ్యోతి, వజ్జా లక్ష్మి, కేశగాని నీలిమ, హైమావతి, లలితమ్మ, అరుణ, నిర్మల పాల్గొన్నారు.