సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులే లేరా? పార్టీలో ఎవరూ లేకపోవడంతోనే అధిష్ఠానం నవీన్‌యాదవ్‌కు టికెట్ ఇచ్చిందా? ఇదేదో రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నేతలు అన్న మాటలు కావు. ఈ వ్యా ఖ్యలు చేసింది ఎవరో కాదు.. ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి ఇప్పుడు జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులెవరూ సరైనవాళ్లు కాదని, అందుకే ఇప్పుడు తనను సరైన నాయకుడిగా భావించి అధిష్ఠానం టికెట్ ఇచ్చిందంటూ తాజాగా నవీన్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఇటీవలనే పీజేఆర్ స్థానికుడు కాదని సంచలన కామెంట్ చేసిన ఆయన.. తాజాగా ఏఎన్ఐతో మాట్లాడిన సందర్భంగా కాంగ్రెస్‌లో సరైన అభ్యర్థులు లేకపోవడంతోనే తనకు టికెట్ ఇచ్చారని పరోక్షంగా స్పష్టం చేశారు.
‘గత మూడు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీలో సరైన అభ్యర్థులు లేరు. సరైన నాయకుడు కావాలని ప్రజలు కోరుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇయ్యాలనే నిర్ణయం తీసుకుంది. (దేరీస్ నో ప్రాపర్ క్యాండిడేట్ ఇన్ కాంగ్రెస్ పార్టీ డ్యూరింగ్ ద లాస్ట్ త్రీ టైమ్స్. పీపుల్ వాంటెడ్ ఏ లీడర్. సో కాంగ్రెస్ పార్టీ టేకెన్ దిస్ డిసీషన్)’ అని ఏఎన్ఐతో నవీన్ యాదవ్ అన్నారు. అంటే కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన విష్ణువర్ధన్‌రెడ్డి, అజారుద్దీన్లు సరైన అభ్యర్థులు కారని నవీన్‌యాదవ్ అభిప్రాయపడుతున్నారు. నవీన్ తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. పార్టీలోని వారందరిని కలుపుకోవాల్సిన అభ్యర్థి ఇలా సీనియర్ నాయకులను అవమానించేలా మాట్లాడటం సరికాదంటున్నారు.