సిటీబ్యూరో/వెంగళరావునగర్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి, కూతుళ్లకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ప్రేమతో పలకరిస్తున్నారు. అన్ని కాలనీలు, బస్తీల్లో ఉన్న ప్రతి అన్నా, ప్రతి అక్కా, చెల్లి, తల్లి, ప్రతి తండ్రిని కలుస్తూ మమేకమవుతున్నారు. మాగంటి గోపీనాథ్ ఆశయ సాధనకు అలుపెరుగని పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామంటూ ముందుకెళ్తున్నారు. దాదాపు నెల రోజులుగా నియోజకవర్గంలోని 2 వేలకు పైగా గడపల్లోకి వెళ్లి మమేకవుతున్నారు. మాగంటి ఆశయ సాధనకు తమకు మద్దతుగా నిలువాలని కోరుతున్నారు.
ఎప్పుడు ఏ కష్టమొచ్చినా తీర్చేందుకు ప్రజలందరికీ అందుబాటులో ఉంటామంటూ భరోసా కల్పిస్తున్నారు. తల్లి సునీతతో పాటు కూతుళ్లు అక్షర, దిశిర మాగంటి ఆశయ సాధనలో పాలుపంచుకుంటామంటూ ముందుకు సాగుతున్నారు. మాగంటి కుటుంబ ఆడబిడ్డలను నియోజకవర్గంలోని ప్రజలంతా అక్కున చేర్చుకుంటున్నారు. ఇంటింటికీ వెళ్తూ పలకరిస్తున్న సునీత, అక్షర, దిశిరకు తామున్నామంటూ అండగా నిలుస్తున్నారు. మాగంటి సేవలను స్మరించుకుంటూ అక్కున చేర్చుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో కలిసి పని చేద్దామంటూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. దీంతో మాగంటి సునీత ప్రయాణం మెరుపు వేగంతో సాగుతున్నది. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ వెళ్తూ తమకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.
మాగంటి ఆడబిడ్డలతో నియోజకవర్గ ప్రజలతో పాటు కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా కలిసి వస్తున్నారు. మాగంటి గోపీనాథ్ ఆశయ సాధనకు సునీత, అక్షర, దిశిర నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. గడిచిన 27 రోజుల్లోనే 2వేలకు పైగా గడపలను తట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు. బోరబండ, యూసుఫ్‌గూడ, షేక్‌పేట, వెంగళ్రావునగర్, రహ్మత్‌నగర్ డివిజన్ల పరిధిలోని మాగంటి అక్షర, దిశిర ఇంటింటికీ వెళ్లి రానున్న ఎన్నికల్లో తమ తల్లి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతు పలకాలంటూ ప్రచారం చేస్తున్నారు. తండ్రి మాగంటి ఆశయాలను కొనసాగించేందుకు, నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచేందుకు అక్షర, దిశిర కదం తొక్కి కదులుతున్నారు. వారి సంకల్పానికి అనుగుణంగా జూబ్లీహిల్స్‌లోని అన్ని నియోజకవర్గాల ప్రజలు వారికి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఉప ఎన్నికల్లో మాగంటి సునీతాను గెలిపించుకుని గోపీనాథ్‌కు నిజమైన నివాళులర్పిస్తామని మాటిస్తున్నారు. మాగంటి అభిమానులతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తోడుగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు.
పదేండ్ల బీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలు, కార్యకర్తలు కాంగ్రెస్ పాలనలో తీవ్ర వేధింపులకు గురవుతున్నారు. ఎంతో మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల వేధింపులకు గురైన బాధితులను కలుస్తూ వారిలో ఆత్మైస్థెర్యం నింపుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడ్డ బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనార్టీ నాయకుడు సర్దార్ కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. సర్దార్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గుండె నిబ్బరంగా ఉండాలని బీఆర్ఎస్ ఎప్పటికీ మీ వెంటే ఉంటుందని భరోసా కల్పించారు. కాంగ్రెస్ రౌడీలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉంటూ అందరం కలిసికట్టుగా మాగంటి ఆశయాలను సాదిద్దాంమంటూ మనోనిబ్బరం కలిగిస్తున్నారు.
కాంగ్రెస్ రౌడీ మూకలు, నేతలు బెదిరింపులకు పాల్పడితే 9849599999 నెంబర్‌కు ఫోన్ చేయాలని మాగంటి సునీత సూచించారు. ఈ నెంబర్ దివంగత మాగంటి గోపీనాథ్దేనని చెప్పారు. ఇక నుంచి ఈ నెంబర్‌ను ఆపత్కాలంలో ఆదుకునేందుకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే 24 గంటలు స్పందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరికి భయపడొద్దని.. ఆపదలో ఆదుకునేందుకు మాగంటి కుటుంబం ప్రతిక్షణం అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. మాగంటి సేవలను స్మరించుకుంటూ ఇటీవల వాడవాడలా స్మృతి సభలు జరిపారు. మాగంటి స్మృతి సభల్లో సునీత మాట్లాడుతూ.. గోపీనాథ్ నెంబర్‌ను ఎమర్జెన్సీకి వినియోగించనున్నట్లు ప్రకటించారు. ఏ ఆపదొచ్చినా..ఏ సమయంలోనైనా ఈ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.