బంజారాహిల్స్,అక్టోబర్ 11: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామంటూ రెండు నెలల పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు ఊదరగొట్టారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్రావుతో పాటు ఇతర నేతలు బస్తీలు, కాలనీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి మంత్రం పఠించారు. పోటీలు పడి శంకుస్థాపనలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన నిధులను కూడా తామే మంజూరు చేసినట్లు ప్రకటిస్తూ హడావుడి చేశారు. కాగా నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎక్కడిపనులు అక్కడ ఆగిపోయాయి.
తాజాగా శంకుస్థాపనలు చేసిన పనుల్లో 20 శాతం మాత్రమే ప్రారంభం కాగా 80 శాతం పనులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయని స్థానికులు ఆరోపిసుస్తున్నారు. కొత్తపనులను ప్రారంభించడం మాట అటుంచి గత ప్రభుత్వ హయాంలో అద్భుతంగా తీర్చిదిద్దిన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చెత్తకుప్పగా మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ నియోజకవర్గంలోని బస్తీలు కాలనీల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టగా కాంగ్రెస్ నేతల అభివృద్ధి మంత్రం డొల్లేనని తేలింది.
పేదలు అత్యధికంగా నివాసం ఉంటున్న రహ్మత్‌నగర్ డివిజన్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లను వేయించడంతో పాటు పలు బస్తీల్లో డ్రైనేజీ సమస్యలను, తాగునీటి సమస్యలను పరిష్కరించారు. పెండింగ్ పనుల కోసం నిధులు మంజూరు చేయించినా 20నెలలుగా ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా మంత్రులు శంకుస్థాపనల కోసం వేసిన శిలాఫలకాలతో పాటు అడుగడుగునా సమస్యలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారాలతో ప్రధాన రహదారులు దుర్వాసనలు వెదజల్లుతున్నాయి.