న్యూఢిల్లీ: విద్యారంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3వ తరగతి నుంచే విద్యార్థులందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని పాఠశాలలో తప్పనిసరిగా చేర్చాలని విద్యా మంత్రిత్వశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీనికి సంబంధించి ఒక సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ ఫ్రేమ్‌వర్క్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం 18 వేలకుగాపైగా సీబీఎస్ఈ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఏఐని ఒక నైపుణ్య కోర్సుగా అందిస్తున్నారు. ఏఐ, ఉద్యోగాలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ఏఐ కారణంగా సుమారు 20 లక్షల సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగైనా, సరైన వాతావరణాన్ని సృష్టిస్తే 80 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది.
ఏఐ రంగంలో భారత భవిష్యత్తు కోసం ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని, తగినంత మౌలిక సదుపాయాలు కల్పించాలని నివేదిక సిఫార్సు చేసింది. ఈ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటే, ఏఐ రంగంలో భారత్ కేవలం తన ఉద్యోగులను కాపాడుకోవడమే కాకుండా, ప్రపంచ ఏఐ పటంలో నాయకత్వం వహించగలదని నివేదిక స్పష్టం చేసింది.