కుత్బుల్లాపూర్, అక్టోబర్ 4: సహజంగా ఈ రోజుల్లో దొంగలంటేనే పిల్లలు భయాందోళనతో ఆమదదూరం వెళ్తారు. కానీ ఇక్కడ ఓ బాలిక శివంగిలా మారి ఆ దొంగను వెంటాడి ఉరికించింది. ఈ వీడియో సీసీకెమెరాలో లభ్యం కావడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారి బాలిక దైర్యసహసానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్లితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ డివిజన్ భగత్‌సింగ్‌నగర్ రోడ్ నంబర్ 12లో ఉమామహేశ్వరీ అనే తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు.
అయితే అదే ఇంట్లో పైన కిరాయికి ఉంటున్న అంజనేయులు కూతరు భవాని(13) షాప్‌కు వెళ్లేందుకు మెట్లపై నుండి కిందకు దిగే సమయంలో కింద ఓనర్ ఇంట్లో తాళం తీసి ఉండడంతో పాటు లోపల ఎదో శబ్ధం వచ్చింది. ఇంట్లో ఉన్నది దొంగ అని గుర్తించని బాలిక ఇంట్లో ఎవరూ అంటూ గట్టిగా అర్చింది. లోపలకు వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరంగా పడి ఉండడంతో పాటు కొత్తగా ఓ వ్యక్తి (దొంగ) దర్శనమివ్వడంతో కొత్తగా ఉన్నావు ఎవరని ప్రశ్నించి, ఇంట్లో ఆంటీ లేదా అంటూ గట్టిగా ఉమా ఆంటీ అని పిలుస్తుంటే పలుకు లేకపోవడంతో అనుమానం వచ్చి దొంగను అక్కడే అడ్డుకొని జేబులు చెక్ చేసే సమయంలో సదరు దొంగ ఆ బాలికను నెట్టేసి పారిపోయేందుకు బయటకు పరుగులు తీశాడు.
ఆ దొంగను పట్టుకునేందుకు దొంగ..దొంగ పట్టుకోండంటూ రోడ్డుపై అరుచుకుంటూ పరిగెత్తినా ఎవరూ స్పందించకపోవడంతో సగం దూరం వరకు అలాగే వెళ్లింది. కాగా ఉమామహేశ్వరీకి సమాచారం ఇవ్వగా ఇంటికి వచ్చి చూసుకోగా ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరంగా ఉండడంతో బీరువా తాళాలు పగులగొట్టి ఉన్నప్పటికి అందులోని వస్తువులు ఏమీ మాయం కాకపోవడం పట్ల జరిగిన విషయాన్ని బాలిక వివరించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వగా జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని తప్పించుకుపోయిన దొంగను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా మైనర్ బాలిక ఏమాత్రం వెనకంజ వేయకుండా దైర్యసహసంతో దొంగను ఉరికించిన తీరు సీసీకెమెరాలో రికార్డు కావడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి బాలికకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.