మణికొండ, అక్టోబర్ 11: అడిగినంత ఇస్తే.. ఇష్టమొచ్చినట్లుగా నిర్మించుకో.. కాదూ కూడదంటే.. టౌన్‌ప్లానింగ్ అధికారులకు చెప్పి నిర్మాణాన్ని కూల్చేయిస్తాం. ప్రశ్నిస్తే పట్టుకొచ్చి గదిలో బంధిస్తామంటూ అధికార పార్టీకి చెందిన ఓ మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్ నిర్మాణదారుడిపై దౌర్జన్యానికి దిగారు. నువిచ్చే డబ్బులు మాతోపాటు మున్సిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారులకూ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ కాలేజీ మాస్టర్ నానాజీ (నిర్మాణదారుడు)ని బెదిరించడంతో భయాందోళనకు గురై పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్ గ్రామ పరిధిలో తాను పైసాపైసా కూడబెట్టి కొనుగోలు చేసిన స్థలంలో ఇంటిని నిర్మించుకుంటుండుగా ఓ మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్ డబ్బులు ఇవ్వాలంటూ వేధించసాగారు. తమకు రూ.10 లక్షల నగదు ఇస్తేనే ఇంటిని నిర్మించుకోవాలని లేకపోతే అధికారులకు చెప్పి కూల్చివేయిస్తామంటూ బెదిరించారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను కలవగా..ఆయన కూడా వారికే వంతపాడారని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. ఇళ్లు నిర్మించుకుంటే ఎంతోకొంత స్థానికంగా సమర్పించుకోవాలంటూ ఉచిత సలహా ఇస్తూ స్థానిక మాజీ డిప్యూటీ మేయర్ రాజేందర్‌రెడ్డిని కలవాలంటూ తెలిపారు.
ఎమ్మెల్యే సూచన మేరకు నానాజీ శుక్రవారం రాత్రి హైదర్షాకోట్లోని రాజేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కలవగా.. మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్‌రెడ్డిని పిలిపించి అడిగారని భాధితుడు తెలిపారు. అయితే ఎంతకీ శ్రీనాథ్‌రెడ్డి రూ.10 లక్షలు ఇవ్వాలంటూ పట్టుబట్టడంతో తాను అంతగా ఇచ్చుకోలేనని.. రూ.4లక్షల వరకు ఇవ్వగలనని నానాజీ తెలిపారు. అవన్నీ మాకు తెలియదంటూ రూ.10లక్షలు ఇవ్వాల్సిందే అంటూ మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ ఇద్దరూ బెదిరించి దౌర్జన్యంగా తన వద్ద నుంచి రూ.4లక్షల80వేల నగదు తీసుకుని, మిగతా డబ్బులు తీసుకురావాలని లేకపోతే రూంలో బంధించి కొట్టి చంపుతామంటూ బెదిరించారని నానాజీ తెలిపాడు.
తాను ఇచ్చే డబ్బులలో మున్సిపల్ కమిషనర్, టీపీవోలకు కూడా వాటా ఉంటుందని వారు చెప్పారని బాధితుడు తెలిపాడు. దీంతో వారు అడిగినంత ఇవ్వలేక దిక్కుతోచని స్థితిలో శనివారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ రాజేందర్‌రెడ్డి, టీపీవో రాకేష్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే తన వద్ద ఉన్న ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించినట్లు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు.. మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్‌రెడ్డి, అతని అనుచరుడు సందీప్‌పై కేసు నమోదు చేశారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి నిర్మాణానికి అంతస్తుకు రూ.2 నుంచి రూ.5 లక్షలు ఇవ్వాల్సిందే.. లేదంటే కూల్చివేస్తామంటూ స్థానిక నేతలు పరోక్ష హెచ్చరికలు జారీచేస్తారని స్థానికులు వాపోతున్నారు. ఈ వ్యవహారంలో టౌన్‌ప్లానింగ్ అధికారి రాకేష్‌సింగ్, కమిషనర్ శరత్చంద్ర తెరవెనుక పాత్రలను పోషిస్తున్నారంటూ ఆరోపణలున్నాయి.
ఇప్పటికే కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. ఇక మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటైర్లెతే నిత్యం అధికారుల కనుసన్నలో ఉంటూ బిల్డర్లను, నిర్మాణదారులను టార్గెట్ చేస్తూ ఇదే తరహాలో వసూళ్లు చేస్తారని తెలిసింది. తమ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం ఉండడని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్.. బండ్లగూడా జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని స్థానిక నేతలపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఉన్నతాధికారులు ఇక్కడి అధికారులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.