హైదరాబాద్, అక్టోబర్ 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): శిలాజ ఇంధనాలతో విద్యుదుత్పత్తి ఖర్చుతో కూడుకొన్నదే కాకుండా పర్యావరణానికి కూడా నష్టాన్ని చేకూరుస్తున్నది. ఈక్రమంలోనే పర్యావరణహిత విద్యుదుత్పత్తి సాధనాలు తెరమీదకు వచ్చాయి. అందులో ప్రధానమైనది సౌర విద్యుదుత్పత్తి. అయితే, రోజులో సూర్యకాంతి తీవ్రంగా ఉండే ఆరేడు గంటలపాటే సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుదుత్పత్తి సాధ్యమవుతున్నది. దీంతో ‘రాత్రిళ్లు కూడా సూర్యకాంతిని భూమి మీదకు తీసుకొస్తే, మరింత చవకైన విద్యుదుత్పత్తి సాధ్యపడుతుంది కదా’అని అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ అనే స్టార్టప్ కంపెనీ సమాలోచనలు చేసింది. ఈ క్రమంలోనే ఓ వినూత్న ప్రయోగానికి అంకురార్పణ చేసింది.
పగలు, రాత్రిళ్లూ అని తేడా లేకుండా సూర్యకాంతితో నిరంతరాయంగా విద్యుత్తును ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా భూమికి 625 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రత్యేక కోణాల్లో కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశపెడతారు. ఆయా శాటిలైట్ల మీద 54 మీటర్ల వెడల్పుతో ఉండే బ్రహ్మాండమైన దర్పణాలను అమరుస్తారు. ఈ శాటిలైట్ల మీది దర్పణాలపై సూర్యకాంతి ఎల్లప్పుడూ ప్రసరించేలా భూభ్రమణానికి, సూర్యుడి కాంతి దిశకు అనుగుణంగా ఈ ఉపగ్రహాలను ప్రవేశపెడతారు. అలా.. ప్రత్యేక కోణంలో సూర్యకాంతి రాత్రిళ్లు కూడా భూమి మీద నిర్దిష్ట ప్రాంతాల్లో ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో సోలార్ఫామ్స్ను ఏర్పాటు చేసి 24 గంటలపాటు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తారు.
ఇయర్ఎండిల్-1 పేరిట టెస్ట్ శాటిలైట్‌ను వచ్చే ఏడాది రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ కంపెనీ ప్రయోగించనున్నది. 2030నాటికి 4 వేల శాటిలైట్లను ప్రయోగించడమే లక్ష్యంగా కంపెనీ ముందుకు వెళ్తున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా చదరపు మీటరుకు 200 వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడమే తమ ధ్యేయమని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
రాత్రిపూట కూడా సూర్యకాంతి ప్రసరణ జరిగితే, భూమి మీది మొక్కలు, జీవులు, ఇతరత్రా చిరుప్రాణుల దినచర్య అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉన్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంతి కాలుష్యంతోపాటు రోదసిలో ఉపగ్రహ వ్యర్థాలు కూడా పెరిగే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు.